పచ్చిరొట్ట ఎరువుతో పంటలకు బంగారు భవిష్యత్

★ 50% సబ్సిడీపై జీలుగ విత్తనాల పంపిణీ ప్రారంభం ★ అధిక దిగుబడులకు జీలుగ విత్తనాలు ఉపయోగించాలి : ఇంగిలే రామారావు ★ రైతులు పట్టాదారు పాస్‌బుక్ జిరాక్స్‌తో వెంటనే నమోదు చేసుకోవాలి

పయనించే సూర్యుడు / మే 26 / దిడ్డి రాము / జమ్మికుంట రూరల్ / ఇల్లంతకుంట మండల పరిధిలోని రైతులకు ప్రభుత్వం ఆధ్వర్యంలో 50 శాతం సబ్సిడీపై జీలుగ విత్తనాలను అందిస్తున్నట్లు శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానం చైర్మన్ ఇంగిలే రామారావు తెలిపారు. అవసరం ఉన్న రైతులు ఈ అవకాశాన్ని వినియోగించుకొని జీలుగ విత్తనాలను కొనుగోలు చేయాలని ఆయన కోరారు. ఒక జీలుగ బస్తా మొత్తం ధర రూ.4905 కాగా, ప్రభుత్వం అందిస్తున్న 50 శాతం సబ్సిడీ తర్వాత రైతులు కేవలం రూ.2452.50 మాత్రమే చెల్లించాల్సి ఉంటుందని వివరించారు. వరి నాట్లు వేసే ముందు జీలుగ విత్తనాలను పొలాల్లో చల్లి, అవి పెరిగిన తర్వాత దున్ని నాటు వేస్తే భూమికి పచ్చిరొట్ట ఎరువులా ఉపయోగపడటంతో పాటు వరి పంట అధిక దిగుబడులు ఇస్తుందని తెలిపారు. ఈ పద్ధతి వల్ల భూమి సారవంతం పెరిగి రసాయన ఎరువుల వినియోగం కూడా కొంత మేర తగ్గే అవకాశం ఉందన్నారు. ఇల్లంతకుంటలోని డీసీఎంఎస్ కాంప్లెక్స్ ద్వారా లక్ష్మన్నపల్లి గ్రామంలో 200 బస్తాలు, రాచపల్లి గ్రామంలో 200 బస్తాలు, మల్యాల గ్రామంలో 133 బస్తాలు, సిరిసేడు గ్రామంలో 200 బస్తాలు సహా మొత్తం దాదాపు 930 బస్తాలు రైతులకు అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. ఒక బస్తాలో 30 కిలోల విత్తనం ఉండగా, అది సుమారు రెండున్నర ఎకరాల వరకు సరిపోతుందని అధికారులు పేర్కొన్నారు. జీలుగ విత్తనాల సరఫరా కార్యక్రమాన్ని వ్యవసాయ శాఖ అధికారులు సమన్వయంతో నిర్వహిస్తున్నారని, రైతులకు ఎలాంటి సందేహాలు లేదా అవసరాలు ఉన్నా సంబంధిత వ్యవసాయ శాఖ ఏఓ, ఏఈఓలను సంప్రదించాలని సూచించారు. రైతులు పట్టాదారు పాస్‌బుక్ జిరాక్స్ కాపీతో వెంటనే నమోదు చేసుకుని సబ్సిడీ ప్రయోజనాన్ని పొందాలని పిలుపునిచ్చారు.