పదవ తరగతి ఉత్తీర్ణ విద్యార్థులకు అభినందన సభ

★ ఎమ్మెల్యే గౌతు శిరీష చేతుల మీదుగా బహుమతుల ప్రదానం

పయనించే సూర్యుడు న్యూస్ మే 22 పలాస నియోజకవర్గం ప్రతినిధి రత్నాల రమేష్. పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలోని కాశీబుగ్గలో గల "పి.ఎమ్. శ్రీ" పథకం ఆధ్వర్యంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఇటీవల 10వ తరగతి ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు అభినందన సభ గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పలాస నియోజకవర్గ ఎమ్మెల్యే గౌతు శిరీష ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్తు, విద్యలో క్రమశిక్షణ ప్రాముఖ్యతతో పాటు పిల్లల ఉన్నతికి తల్లిదండ్రుల పాత్ర ఎంతో కీలకమని వివరించారు. ప్రభుత్వ పాఠశాలల్లో అందుతున్న విద్యా అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని విద్యార్థులకు సూచించారు. మొత్తం 250 మంది విద్యార్థులు గాను 200 పైగా ఉత్తీర్ణత సాధించుగా అందులో 580 పైగా మార్కులు సాధించిన వారు 9 మంది 570 పైగా మార్కులు సాధించిన వారు ఏడు మంది 500 పైగా మార్కులు సాధించిన వారు 42 మంది ఉండడం తనకెంతో ఆనందాన్నిచ్చిందని ఆమె అన్నారు.పాఠశాలలో అత్యధికంగా 591 మార్కులు సాధించిన విద్యార్థిని పూజారి కీర్తిని ప్రత్యేకంగా ఎమ్మెల్యే అభినందించారు.అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులందరికీ ఎమ్మెల్యే చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. అనంతరం పాఠశాల ప్రచార రథం ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లోని తమ పిల్లలను చేర్పించి వారి ఉన్నత భవిష్యత్తుకు తోడ్పడాలని తల్లిదడ్రులను కోరి, అవగాహన కల్పించారు. కార్యక్రమంలో పలాస పట్టణ ముఖ్య నాయకులు, ప్రధానోపాధ్యాయులు చిన్నం నాయుడు పాఠశాల ఉపాధ్యాయులు, ఉపాధ్యాయేతర సిబ్బంది, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, కార్యకర్తలు పాల్గొన్నారు.