పయనించే సూర్యుడు న్యూస్: పెద్దపల్లి, రామగిరి-06 పర్యావరణాన్ని కాపాడుకోవడం మన అందరి బాధ్యతని రామగుండం-3 ఏరియా జనరల్ మేనేజర్ సుంకర మధుసూదన్, అడ్రియాల ప్రాజెక్ట్ ఏరియా ఇంచార్జ్ జనరల్ మేనేజర్ బండి సత్య నారాయణ అన్నారు.జూన్-5, ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని రామగుండం-3, అడ్రియాల ప్రాజెక్ట్ ఏరియాలోని జి.యం. కార్యాలయం నందు శుక్రవారం నిర్వహించిన కార్యక్రమంలో భాగంగా ముందుగా పర్యావరణ విభాగాధిపతి పి.రాజారెడ్డి ఉద్యోగులందరితో పర్యావరణ ప్రతిజ్ఞ చేయించారు.అనంతరం ఉద్యోగులందరిలో అవగాహన కల్పించడం కోసం సింగరేణి సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ బుద్ధప్రకాష్ జ్యోతి, ఐఏఎస్ సందేశంతో కూడిన కరపత్రాలను ఆవిష్కరించి ఉద్యోగులందరికీ అందచేయడమే కాకుండా చదివి వినిపించారు.తదుపరి సింగరేణి కోల్ నీర్ ప్లాంట్ గోడ పత్రికను ఆవిష్కరించారు.అనంతరం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన రామగుండం-3 ఏరియా జనరల్ మేనేజర్ సుంకర మధుసూదన్, అడ్రియాల ప్రాజెక్ట్ ఏరియా ఇంచార్జ్ జనరల్ మేనేజర్ బండి సత్య నారాయణ మాట్లాడుతూ ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్రతీ సంవత్సరం ఒక ప్రధాన సమస్యపై ప్రపంచ దేశాలన్నీ దృష్టి సారించడం జరుగుతుందని, ఈ సంవత్సరం “ప్రకృతి నుండి ప్రేరణతో… వాతావరణం కోసం…మన భవిష్యత్తు కోసం” అనే నినాదంతో ప్రపంచ పర్యావరణ దినోత్సవం నిర్వహిస్తున్నామని అన్నారు. పర్యావరణ సంరక్షణలో వ్యక్తి గత చర్యలు కీలక పాత్ర పోషిస్తాయని అన్నారు.సామూహికంగా చెట్ల పెంపకం, ఒక్కసారి వాడి పారేసే ప్లాస్టిక్ వస్తువులు, ప్లాస్టిక్ వ్యర్థాలు పూర్తిగా తగ్గించడం, బయోడిగ్రేడబుల్ ప్లాస్టిక్ వస్తువులు, ప్రత్యామ్నాయ పర్యావరణ అనుకూల ఉత్పత్తుల వినియోగాన్ని ప్రోత్సహించడం, ప్లాస్టిక్ సంచులకు బదులుగా కాటన్ లేదా జనపనార సంచులను వాడటం, ప్లాస్టిక్ ప్లేట్లు, గ్లాసులకు బదులుగా కాగితపు వస్తువులను వాడటం, ప్లాస్టిక్ బాటిళ్ల వాడకం తగ్గించడం లాంటి చర్యలు చేపట్టాలని అన్నారు. మనం జరుపుకుంటున్నటువంటి ప్రపంచ పర్యావరణ దినోత్సవంతో సుస్థిరమైన పర్యావరణ విధానాలకు మద్దతు ఇవ్వడానికి, పర్యావరణ సారథ్య సంస్కృతిని పెంపొందించడానికి కట్టుబడి ఉండాలని, మనమంతా కలిసి పర్యావరణ హితానికి కృషి చేస్తేనే రాబోయే తరాలకు ఆరోగ్యకరమైన, సుస్థిరమైన భవిష్యత్తుని అందించగల్గుతామని ముఖ్యంగా మహిళలు పర్యావరణ పరిరక్షణకు తీసుకోవలసిన చర్యల కోసం ముందు ఉండాలన్నారు.తదుపరి కార్యాలయ ప్రాంగణంలో అధికారులు, ఉద్యోగులు మొక్కలు నాటారు.పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఏరియాలోని వివిధ గనులు, విభాగాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమంలో గుర్తింపు, ప్రాతినిధ్య సంఘాల నాయకులు సంతోష్, కోట రవీందర్ రెడ్డి, అధికారుల సంఘం అధ్యక్షుడు కోల శ్రీనివాస్, ఎస్వోటుజిఎం యం.రామ్మోహన్, విభాగాధిపతులు బి.వి.సత్య నారాయణ, బి.టి.మురళీ కృష్ణ, సివిల్ డిజిఎం రాజేంద్ర కుమార్, ఐలయ్య, రవి చరణ్, రాజేశ్వరి, సునీల్ ప్రసాద్, మేఘన, ఓసి-1 పర్యావరణ అధికారి కిషన్, ఇతర అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.