పల్లె నిద్ర ద్వారా ప్రజల్లో చైతన్యం.. పాల్గొన్న కాకినాడ జిల్లా పోలీసులు…

పయనించే సూర్యుడు మే 23, కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ (బి వి బి) కాకినాడ జిల్లా ఇంచార్జ్ ఎస్పీ రాహుల్ మీనా, ఆదేశాల మేరకు, కాకినాడ ఏఎస్పీ పాటిల్ దేవ్ రాజ్ మనీష్ సూచనలు మేరకు ప్రజలలో భద్రతా భావాన్ని పెంపొందించేందుకు కరప మరియు కాకినాడ రూరల్ మరియు టౌన్ పోలీస్ స్టేషన్ల పరిధిలో నిర్వహించిన "పల్లె నిద్ర" కార్యక్రమంలో కరప ఎస్ఐ టి. సునీత కరప గ్రామంలోనూ, కాకినాడ టూ-టౌన్ ఎస్ఐ దుర్గాప్రసాద్ కాకినాడ, కొత్త కాకినాడ లోనూ మరియు సిబ్బంది పాల్గొని స్థానిక సమస్యలను, పోలీస్ పెట్రోలింగ్ సరళిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ, మహిళల రక్షణ కొరకు ప్రతి ఒక్కరూ తమ ఫోన్లలో "శక్తి యాప్" ఇన్స్టాల్ చేసుకోవాలని, అత్యవసర సమయాల్లో SOS బటన్ నొక్కడం ద్వారా లేదా లొకేషన్ షేర్ చేయడం ద్వారా పోలీసులు ప్రయాణాలను మానిటర్ చేస్తూ రక్షణ కల్పిస్తారని, అలాగే అత్యవసర సహాయం కోసం 112 నంబర్‌ను కూడా సంప్రదించవచ్చని కోరారు. వేసవి సెలవుల దృష్ట్యా, ఇంట్లో ఎవరూ లేకుండా పొరుగూరు వెళ్లేటప్పుడు పోలీసు సహాయం పొందవచ్చని, గూగుల్ ప్లే స్టోర్ లో లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టం (ఎల్ ఎచ్ ఎమ్ ఎస్) యాప్ డౌన్లోడ్ చేసుకుని, అందులో మీ ప్రయాణం వివరాలు, మీ లొకేషన్ మొదలైన వివరాలు ఎంటర్ చేస్తే, స్థానిక పోలీసులు వచ్చి, మీరు ఇంటి నుండి బయలుదేరక ముందే పోలీస్ కంట్రోల్ రూమ్ కి అనుసంధానం చేయబడిన కెమెరాలు మీ ఇంటిలో బిగించి వెళ్తారని, ఈ సేవలు పూర్తిగా ఉచితం అని తెలియజేశారు. మహిళా భద్రతకు భంగం కలిగేలా ప్రవర్తిస్తే ఎవరిని ఉపేక్షించేది లేదని, చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోబడతాయని.. అలాగే యువత గంజాయి, మద్యం వంటి మత్తు పదార్థాలకు, బైక్ స్టంట్లు, క్రికెట్ బెట్టింగ్‌లు, లోన్ యాప్‌లు మరియు సైబర్ నేరాలకు దూరంగా ఉండాలని హెచ్చరిస్తూ, గంజాయి సమాచారం తెలిస్తే వెంటనే పోలీసులకు లేదా టోల్ ఫ్రీ నంబర్‌ 1972 కు కాల్ చేయాలని సూచించారు. ఇదే సమయంలో, స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ వారం రోజుల పాటు "హై అలర్ట్" ప్రకటించినందున, ఎండ తీవ్రత దృష్ట్యా అత్యవసరమైతే తప్ప బయటకు రాకూడదని, ముఖ్యంగా వృద్ధులు, బాలింతలు, చిన్నారుల పట్ల జాగ్రత్త వహించాలని, కూలి పనులకు వెళ్లేవారు మజ్జిగ, మంచి నీరు, ఓ.ఆర్.ఎస్ (ORS) ప్యాకెట్లు వెంట ఉంచుకుని అప్పుడప్పుడు తాగుతూ, ఎండ వేడి ఎక్కువగా ఉన్నప్పుడు చెట్ల నీడన సేదతీరాలని ప్రజలకు పలు కీలక సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో గ్రామస్తులు పాల్గొన్నారు.