పాఠశాల కార్యక్రమాల పరిశీలించిన జిల్లా అకాడమిక్ మానిటరింగ్ ఆఫీసర్

పయనించే సూర్యుడు న్యూస్, జూలై 09 (ఏలేశ్వరం మండల రిపోర్టర్ ఏ శివాజీ) : యర్రవరం గ్రామంలోని ప్రధానమంత్రి వికసిత్ భారత్ విద్యాలయం జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలను కాకినాడ జిల్లా అకాడమిక్ మానిటరింగ్ ఆఫీసర్ వి.జగన్మోహన్ సందర్శించి, జాతీయ విద్యా విధానం–2020లో గుర్తించిన 21 పారామీటర్ల అమలు స్థితిని స్వయంగా పరిశీలించారు. పాఠశాలలో అమలవుతున్న విద్యా,సహవిద్యా,మౌలిక సదుపాయాల కార్యక్రమాలను పరిశీలించి, వాటి ప్రభావాన్ని అంచనా వేశారు. కంప్యూటర్ ల్యాబ్, స్మార్ట్ తరగతి గదులు, సైన్స్ ల్యాబ్, గ్రంథాలయం,క్రీడా సదుపాయాలు, హరిత పాఠశాల కార్యక్రమాలు,విద్యార్థుల హాజరు పర్యవేక్షణ, పరిశుభ్రత,తాగునీటి సదుపాయాలు, బాలికల సంక్షేమ సౌకర్యాలు తదితర అంశాలను పరిశీలించారు. విద్యార్థుల విద్యా ప్రగతిని సమీక్షించి, విద్యా ప్రమాణాల పెంపు కోసం ఉపాధ్యాయులకు మరియు విద్యార్థులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా అకాడమిక్ మానిటరింగ్ ఆఫీసర్ జగన్మోహన్ మాట్లాడుతూ,పీఎం శ్రీ పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం పాఠశాలలకు అనేక అభివృద్ధి అవకాశాలను కల్పిస్తోందని, విద్యార్థులు ఆ అవకాశాలను సద్వినియోగం చేసుకొని విద్యా, క్రీడా,సాంస్కృతిక మరియు సృజనాత్మక రంగాలలో ప్రతిభ కనబరచాలని సూచించారు.విద్యార్థుల సమగ్ర వికాసమే పీఎం శ్రీ పథకం ప్రధాన లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు యన్.కన్నబాబు మాట్లాడుతూ, పీఎం శ్రీ పథకం ద్వారా పాఠశాలలో అనేక వినూత్న కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహిస్తున్నామని తెలిపారు.గత విద్యా సంవత్సరంలో జాతీయ దినోత్సవాలు,విజ్ఞాన యాత్రలు,ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్,బ్యాగ్‌లెస్ డేస్,భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ కార్యక్రమాలు ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం సమర్థవంతంగా నిర్వహించామని వివరించారు.అదేవిధంగా శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ స్మార్ట్ తరగతి గదుల ద్వారా బోధన నిర్వహిస్తున్నామని, పాఠశాలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి విద్యా బోధనను మరింత గుణాత్మకంగా తీర్చిదిద్దుతున్నామని తెలిపారు. విద్యార్థులు,ఉపాధ్యాయులకు ఐడీ కార్డులు జారీ చేయడం,అగ్నిమాపక సిలిండర్లను ఏర్పాటు చేయడం వంటి భద్రతా చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు.