పాలమూరును ముంచింది బీఆర్ఎస్ ప్రభుత్వమే

టీజేఎస్ జిల్లా అధ్యక్షుడు మొసలి శ్యాంప్రసాద్ రెడ్డి

పయనించే సూర్యుడు మార్చి 24 నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లి రిపోర్టర్ శ్రావణ్ కుమార్ హైదరాబాద్‌లోని తెలంగాణ జన సమితి రాష్ట్ర కార్యాలయంలో ఇటీవల నూతన అధ్యక్షుడిగా నియమితులైన నాయకుడికి ఘన సన్మాన కార్యక్రమం నిర్వహించారు. నాగర్‌కర్నూల్ జిల్లా తరపున జిల్లా అధ్యక్షుడు మొసలి శ్యాంప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ నాయకులు పాల్గొని శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం జరిగిన రాష్ట్ర కమిటీ సమావేశంలో మొసలి శ్యాంప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుపై బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలను తప్పుదారి పట్టిస్తోందని ఆరోపించారు. ప్రాజెక్టులో 90 శాతం పనులు పూర్తయ్యాయని చెబుతున్నా, వాస్తవానికి సగం పనులు కూడా పూర్తి కాలేదన్నారు. పాలమూరు జిల్లాకు న్యాయం చేయకుండా కాలేశ్వరం ప్రాజెక్టుపై భారీగా ఖర్చు చేశారని విమర్శించారు. జీవో నెంబర్ 72ను వెంటనే అమలు చేసి జూరాల నుంచి లక్ష్మీదేవిపల్లి వరకు నీటిని అందించాలని డిమాండ్ చేశారు. పాలమూరు ప్రజల నీటి హక్కుల కోసం టీజేఎస్ పార్టీ పోరాటం కొనసాగిస్తుందని తెలిపారు. త్వరలో నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంగా నీటి నిపుణులు, ప్రజాసంఘాలతో కలిసి సెమినార్ నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు అంజి యాదవ్, ఖాదర్ భాషా, ప్రకాష్ గౌడ్, అలంపూర్ రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు.