పయనించే సూర్యుడు జులై 9 నాగర్ కర్నూలు జిల్లా బిజినపల్లి రిపోర్టర్ శ్రావణ్ కుమార్ నాగర్‌కర్నూల్ జిల్లా బిజినపల్లి మండలంలోని పాలెం గ్రామంలో నూతనంగా నిర్మించిన 33/11 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్‌ను రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారికంగా ప్రారంభించారు. గ్రామీణ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాను మరింత బలోపేతం చేసి, ప్రజలకు నిరంతరాయంగా నాణ్యమైన విద్యుత్ అందించాలనే లక్ష్యంతో ఈ సబ్‌స్టేషన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు మంత్రి తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వ పనులను నాణ్యత ప్రమాణాలతో, నిర్ణీత గడువులోగా పూర్తి చేసి ప్రజలకు అంకితం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. విద్యుత్ మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని, కొత్త సబ్‌స్టేషన్‌తో పాలెం గ్రామంతో పాటు పరిసర ప్రాంతాల ప్రజలకు మెరుగైన విద్యుత్ సేవలు అందనున్నాయని పేర్కొన్నారు. సబ్‌స్టేషన్ ప్రారంభోత్సవం అనంతరం దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతిని పురస్కరించుకుని పాలెంలోని ఆయన విగ్రహానికి మంత్రి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్ రెడ్డి, నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే డాక్టర్ కూచుకుళ్ల రాజేష్ రెడ్డి, జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్, విద్యుత్ శాఖ సూపరింటెండింగ్ ఇంజనీర్, నాగర్‌కర్నూల్ ఆర్టీవో ఇ. అర్చన, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మిద్దె రాములు.పాలెం సర్పంచ్ రామకృష్ణ కాంగ్రెస్ నాయకులు గోవిందు రామకృష్ణ జయ కృష్ణ గౌడ్ కృష్ణవేణి సంపత్ విద్యుత్ శాఖ అధికారులు, వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు, గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.