పయనించే సూర్యుడు మే 28 నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లి రిపోర్టర్ శ్రావణ్ కుమార్ బిజినపల్లి మండలం పాలెం గ్రామంలోని పారిశ్రామికవాడలో నిర్మించిన ఓ ఫ్యాక్టరీ నుంచి విపరీతమైన విషవాయువులతో కూడిన కాలుష్య పొగలు వెలువడుతున్నాయని గ్రామ ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కాలుష్యం కారణంగా గ్రామ ప్రజలు అనారోగ్య సమస్యలకు గురవుతూ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని గ్రామ సర్పంచ్ బోనాసి రామకృష్ణ దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై స్పందించిన సర్పంచ్ బోనాసి రామకృష్ణ గ్రామ పెద్దలతో కలిసి పారిశ్రామికవాడను సందర్శించి పరిస్థితిని పరిశీలించారు. కాలుష్యానికి గల కారణాలను ఫ్యాక్టరీ యాజమాన్యాన్ని అడిగి తెలుసుకున్నారు. అలాగే కాలుష్య నియంత్రణకు పాటించాల్సిన జాగ్రత్తలు, పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన నియమ నిబంధనలను వారికి వివరించారు. ఇకముందు ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన పూర్తి బాధ్యత ఫ్యాక్టరీ యాజమాన్యంపైనే ఉందని సర్పంచ్ స్పష్టం చేశారు. గ్రామ ప్రజల ఆరోగ్యం, సంక్షేమమే తమకు ముఖ్యమని తెలిపారు. ఈ సమస్యపై సంబంధిత పర్యావరణ కాలుష్య నియంత్రణ మండలి అధికారులతో పాటు జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి ప్రజలకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని గ్రామ ప్రజలకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ పుప్పాల శ్రీనివాస్ గౌడ్, ఉప సర్పంచ్ గోవిందు శ్రీనివాసులు, వార్డు సభ్యులు వస్పరి శివనాగులు, దొంతరమోని పరశురాములు, చంద్రశేఖర్, కాంగ్రెస్ పార్టీ నాయకులు గోవిందు శేఖర్, మాజీ వార్డ్ మెంబర్ మాడుగుల స్వామి, గ్రామస్తులు నరసింహ గౌడ్, భగవత్ గౌడ్, రాంనగర్ కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.