పువ్వాడ నగర్ లో దారి తప్పిన డబుల్ బెడ్రూం ఫ్లాట్లు

పయనించే సూర్యుడు మే 3 ఖమ్మం జిల్లా బ్యూరో గుగులోత్ భావుసింగ్ నాయక్

ఖమ్మం :
ప్రభుత్వం నిరుపేదలకు ఆసరాగా నిలవాలని ప్రతిష్టాత్మకంగా నిర్మించిన డబుల్ బెడ్రూం ప్లాట్లు రఘునాథపాలెం మండలం,పువ్వాడ ఉదయ్ నగర్‌లో దారి తప్పుతున్నాయి.అర్హులైన పేదలకు దక్కాల్సిన ఇళ్లు.. నేడు అధికార పార్టీ నాయకుల జేబులు నింపే కామధేనువులుగా మారాయి. ఎవరికీ కేటాయించకుండా ఖాళీగా ఉన్న సుమారు నలబై (40) ప్లాట్లలో కొన్ని ప్లాట్లను కొందరు అధికార పార్టీ నేతలు తమ సొంత ఆస్తిలా భావిస్తూ, ఇష్టానుసారంగా అద్దెలకు ఇచ్చుకుంటూ లక్షలాది రూపాయలు సొమ్ము చేసుకుంటున్న వైనం స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది….

నిబంధనలు బేఖాతరు.. లీడర్ల ఇష్టారాజ్యం!

స్థానికులు మరియు బాధితులు కథనం ప్రకారం… పువ్వాడ ఉదయ్ నగర్‌లోని డబుల్ బెడ్రూం సముదాయంలో ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న వార్డ్ మెంబర్‌తో పాటు, అధికార పార్టీకి చెందిన మరికొంతమంది ముఖ్య కార్యకర్తలు ఎలాంటి అనుమతులు లేకుండానే ఇష్టారాజ్యంగా ఈ ప్లాట్లలో నివాసం ఉంటున్నారు. ప్రభుత్వ ఆస్తులను రక్షించాల్సిన ప్రజాప్రతినిధులే ఇలా అక్రమ ఆక్రమణలకు పాల్పడటంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి…ఈ అక్రమ దందా అంతా స్థానిక అధికారుల కళ్ల ముందే జరుగుతున్నా.. పట్టించుకోవాల్సిన పంచాయతీ సెక్రటరీ, ఎంపీడీవో అటువైపు కన్నెత్తి కూడా చూడకపోవడం గమనార్హం. అధికారులు అధికార పార్టీ నాయకులకు తొత్తులుగా మారిపోయారని, వారి లీలలను చూసీచూడనట్లు వదిలేస్తున్నారని స్థానికులు బహిరంగంగానే ఆరోపిస్తున్నారు.మరింత విడ్డూరమేమిటంటే… ఈ మధ్య కాలంలోనే అన్ని నిబంధనలకు విరుద్ధంగా, ఎలాంటి ముందస్తు నోటిఫికేషన్ లేకుండా పంచాయతీ గుమస్తాకు ఎంపీడీవో స్వయంగా ఒక డబుల్ బెడ్రూం ప్లాట్‌ను కేటాయించడం తీవ్ర వివాదాస్పదంగా మారింది….

తాజా, మాజీల ‘చక్రం’… బంధువర్గానికి దోచిపెట్టడమే లక్ష్యం!…

సదరు పంచాయతీ గుమస్తాకు గత ప్రభుత్వ హయాంలోనే రెండు ప్లాట్లను కేటాయించిన ఘనత గత మాజీ సర్పంచ్‌ది కాగా ప్రస్తుత తాజా ప్రజాప్రతినిధి ఒకడుగు ముందుకు వేసి డబుల్ బెడ్రూం ప్లాట్ ఇప్పించడం విశేషం అంతే కాకుండా తన బంధువర్గానికి ఖాళీ స్థలాలను కేటాయించడంతో పాటు అక్రమంగా డబుల్ బెడ్రూం ప్లాట్లలో నివాసం ఉండేలా పూర్తి సహకారం అందిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈ మొత్తం వ్యవహారంలో తాజా, మాజీ ప్రజాప్రతినిధులు తెరవెనుక ఉండి చక్రం తిప్పుతున్నట్లు స్పష్టమవుతోంది….

భయాందోళనల్లో స్థానికులు…

ఊరు, పేరు లేని గుర్తుతెలియని వ్యక్తులు ఇక్కడకు వచ్చి అద్దెలకు దిగుతుండటంతో.. అసలైన డబుల్ బెడ్రూం నివాసితులు తీవ్ర భయాందోళనల మధ్య కాలం వెల్లదీస్తున్నారు. ఎవరి నుండి ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకొస్తుందోనని వారు వణికిపోతున్నారు. రెక్కాడితే గాని డొక్కాడని నిరుపేదలు ప్రశాంతంగా జీవిస్తున్న ఈ ప్రాంతంలో… అధికారుల నిర్లక్ష్యం వల్ల అసాంఘిక శక్తులు ప్రవేశించే ప్రమాదం పొంచి ఉందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.తక్షణమే ఖాళీగా ఉన్న ఆ 40 డబుల్ బెడ్రూం ప్లాట్లను అర్హులైన నిరుపేదలకు కేటాయించాలని,ఈ అక్రమ దందాకు కర్త, కర్మ, క్రియగా వ్యవహరించిన తాజా, మాజీ ప్రజాప్రతినిధులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని,అంతే కాకుండా అధికార పార్టీ నేతలకు సహకరిస్తూ, నిబంధనలు ఉల్లంఘించిన పంచాయతీ కార్యదర్శి, ఎంపీడీవోలపై ఉన్నతాధికారులు తక్షణమే విచారణ జరిపించి శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. అదే విధంగా ఈ అంశంపై మంత్రి తుమ్మల ,జిల్లా కలెక్టర్, ఉన్నతాధికారులు స్పందించి పువ్వాడ ఉదయ్ నగర్ డబుల్ బెడ్రూం ఇళ్లపై సమగ్ర విచారణ జరిపించకపోతే పేదల ఆందోళన ఉధృతం కాక తప్పేలా లేదు.