పయనించే సూర్యుడు గూడూరు న్యూస్ మే 26 గూడూరు పట్టణంలో సోమవారం ఉదయం మానవత్వం పరిమళించింది. స్థానిక ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో, కీర్తిశేషులు పొణకా ఆదిశేషారెడ్డి జ్ఞాపకార్థం, వారి కుమా రుడు పొణకా మల్లికార్జున రెడ్డి పూర్తి ఆర్థిక సహకారంతో నిరుపేద కుటుంబాలకు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. ప్రతి నెల నిర్వహించే సేవా కార్యక్రమాల్లో భాగంగా, సోమవారం ఉదయం 7 గంటలకు గూడూరులోని అల్లూరు ఆదిశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియం నందు ఈ కార్యక్రమం జరిగింది. నిత్యం పట్టణాన్ని శుభ్రం చేస్తూ, సమాజ సేవలో ముందంజలో ఉండే 15 మంది రోడ్లు ఊడ్చే సానిటరీ వర్కర్ల (పారిశుధ్య కార్మికుల) కుటుంబాలను గుర్తించి, వారికి నెలకు సరిపడా 18 రకాల నాణ్యమైన పలసరుకులను అందజేశారు. ఈ సందర్భంగా ప్రగతి సేవా సంస్థ అధ్యక్షులు కడివేటి చంద్రశేఖర్ మాట్లాడుతూ , పట్టణం క్షేమం కోసం నిరంతరం శ్రమిస్తూ, ప్రజలకు ఎలాంటి రోగాలు దరిచేరకుండా పరిసరాలను శుభ్రంగా ఉంచుతున్న శానిటరీ కార్మికుల సేవలు వెలకట్టలేనివని కొనియాడారు. వారి సేవలను గుర్తించి, గౌరవించుకోవాల్సిన బాధ్యత సమాజంపై ఉందన్నారు. సమాజంలో కష్టాల్లో ఉన్న నిరుపేదలను, ముఖ్యంగా నిరంతరం శ్రమిస్తూ పట్టణ పరిశుభ్రతకు పాటుపడే సానిటరీ వర్కర్లను ఆదుకోవడం అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రగతి కుటుంబ సభ్యులు కాటూరి శ్రీనివాసులు, కుమార్ నాయుడు ,శ్రీ చైతన్య శ్రీనివాసులు ,రాజశేఖర్ రెడ్డి శ్యామ్, కోట వెంకటేశ్వర్లు ,గోల్డ్ షాప్ మల్లికార్జున కృష్ణారెడ్డి విజయ్ నాగేంద్ర ,తదితరులు పాల్గొన్నారు.