ప్రజావాణిలో 10 ఫిర్యాదులు స్వీకరణ

పయనించే సూర్యుడు,కోరుట్ల జూన్ 16. కోరుట్ల రెవెన్యూ డివిజనల్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి మొత్తం 10 ఫిర్యాదులు, వినతులు స్వీకరించినట్లు రెవెన్యూ డివిజనల్ అధికారి ఎల్. జీవాకర్ రెడ్డి తెలిపారు. డివిజన్ స్థాయి అధికారులతో కలిసి ప్రజల సమస్యలను స్వీకరించిన ఆయన మాట్లాడుతూ, డివిజన్ పరిధిలోని వివిధ మండలాల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలను ప్రజావాణి ద్వారా విన్నవించుకున్నారని పేర్కొన్నారు. అధికారులు తమ శాఖలకు సంబంధించిన అర్జీలపై సానుకూలంగా స్పందించి, సమగ్ర విచారణ నిర్వహించి త్వరితగతిన పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. పెండింగ్ ఉంచకుండా ప్రతి అర్జీని ఎప్పటికప్పుడు పరిశీలించాలని ఆదేశించారు ఈ సందర్భంగా రెవెన్యూ శాఖకు 6, మున్సిపల్ శాఖకు 1, హౌసింగ్ శాఖకు 1, ఎక్సైజ్ శాఖకు 1, ఎలక్ట్రిసిటీ శాఖకు 1 చొప్పున మొత్తం 10 వినతులు అందినట్లు తెలిపారు. సంబంధిత శాఖల అధికారులు వాటి పరిష్కారానికి వెంటనే చర్యలు చేపట్టాలని సూచించారు. ప్రతి సోమవారం ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు ప్రజావాణి కార్యక్రమం నిర్వహించబడుతుందని, ఇందులో డివిజన్ స్థాయి అధికారులు, వివిధ శాఖల ప్రతినిధులు పాల్గొంటారని వెల్లడించారు. కార్యక్రమంలో డీపీవో (పీఆర్) కె. ధనలక్ష్మి, ఏఈఈ (ఆర్ అండ్ బీ) బి. లక్ష్మీకాంత్ పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.