ప్రజా గళం మూగబోయింది… విప్లవ యోధుడు అరుణోదయ నాగన్నకు విప్లవ జోహార్లు

పయనించే సూర్యుడు న్యూస్ జులై 4 సింగరేణి రిపోర్టర్ నరేష్ విప్లవ పాటల పెద్దన్న, ప్రజా సమస్యలను తన గళంతో ప్రజల ముందుకు తీసుకువచ్చిన ప్రజాకళాకారుడు అరుణోదయ నాగన్న శుక్రవారం కన్నుమూశారు. ప్రజా చైతన్యానికి అంకితమైన జీవితాన్ని గడిపిన నాగన్న మరణం ప్రజా ఉద్యమాలకు, సాంస్కృతిక రంగానికి తీరని లోటని ప్రజానాట్యమండలి నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల బాధలు, సమస్యలు, హక్కుల కోసం తన పాటల ద్వారా నిరంతరం పోరాడిన నాగన్న, “అరుణోదయ” అనే పేరునే తన ఇంటి పేరుగా మార్చుకుని ప్రజా కళాకారుడిగా ప్రత్యేక గుర్తింపు పొందారు. ఆయన గళం అనేక ఉద్యమాలకు స్ఫూర్తినిచ్చిందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ప్రజానాట్యమండలి ఖమ్మం జిల్లా ఉపాధ్యక్షులు కే. నరేంద్ర, జిల్లా కమిటీ సభ్యులు కరకపల్లి రాయమల్లు, రాచర్ల రణధీర్, పాయం వెంకన్న, బచ్చల వంశీకృష్ణలు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. మతోన్మాదం, సామ్రాజ్యవాద శక్తులు పెచ్చరిల్లుతున్న ఈ సమయంలో నాగన్నలాంటి ప్రజా కళాకారుడు లేకపోవడం ప్రజా చైతన్యానికి ఎదురుదెబ్బ అని ఆందోళన వ్యక్తం చేశారు. అరుదైన ప్రజా కళాకారుడైన అరుణోదయ నాగన్నకు ప్రజానాట్యమండలి (PNM) ఖమ్మం జిల్లా కమిటీ, వైరా డివిజన్ కమిటీ, కారేపల్లి మండల కమిటీ తరఫున విప్లవ జోహార్లు అర్పిస్తూ, ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.