ప్రజా సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి: ఏఐఎఫ్‌బీ నేత వంశీకృష్ణ

జనం న్యూస్ , జూన్ 7 (జిల్లా ఇంచార్జ్ ) స్థానిక జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలోని ఆరో వార్డులో నిర్వహించిన పట్టణ ప్రగతి–ప్రజాపాలన కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ దిలీప్‌కు కాలనీవాసి, న్యాయవాది, ఏఐఎఫ్‌బీ పార్టీ యూత్ కన్వీనర్ గూడెపు వంశీకృష్ణ పలు సమస్యలపై వినతిపత్రాన్ని అందజేశారు.వినతిపత్రంలో ప్రధానంగా రానున్న వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని హౌసింగ్ బోర్డు ప్రాంతంలోని వరద కాలువల ప్రధాన కూడళ్ల వద్ద జాలి గ్రిల్స్ ఏర్పాటు చేయాలని కోరారు. దీంతో ప్లాస్టిక్, ఇతర వ్యర్థాలు కాలువల్లో చేరి నీటి ప్రవాహానికి ఆటంకం కలగకుండా నివారించవచ్చని తెలిపారు. అలాగే కాలనీలో నూతనంగా నిర్మించిన యోగా పార్కును వెంటనే ప్రారంభించి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని, దానికి ఆనుకుని ఉన్న చేతిపంపును పునరుద్ధరించాలని విజ్ఞప్తి చేశారు. ఆరో వార్డులో ఉన్న ఓపెన్ జిమ్‌ను 2020లో నిర్మించిన పార్కులోకి మార్చి ప్రజలు పూర్తిస్థాయిలో వినియోగించుకునేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఓపెన్ జిమ్ సమీపంలో చెత్తతో నిండిన ఖాళీ స్థలాన్ని వెంటనే శుభ్రపరిచి, ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి పనులు చేపట్టాలని సూచించారు. అలాగే ఎటువంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా ఏర్పాటు చేసిన స్పీడ్ బ్రేకర్లను తొలగించాలని విన్నవించారు. వినతిపత్రాన్ని పరిశీలించిన మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ దిలీప్ సమస్యలపై సానుకూలంగా స్పందించి, కౌన్సిల్ సమావేశంలో చర్చించి తగిన నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్ శ్రీపతి స్వర్ణలతా నరేష్, ఏఐఎఫ్‌బీ పార్టీ సోషల్ మీడియా కన్వీనర్ జీయా ఉల్ అలీ, మున్సిపల్ సిబ్బంది, ఆరోగ్య శాఖ సిబ్బంది, అంగన్‌వాడీ టీచర్, బీజేపీ నాయకుడు మహమ్మద్ నసీరుద్దీన్, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.