పయ నించే సూర్యుడు జూలై 7 (ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ) డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా భారతీయ జనతా పార్టీ చేపట్టిన జనతా వారధి కార్యక్రమంలో భాగంగా అమలాపురం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. జిల్లా ఆఫీస్ ఇంచార్జి జనతా వారధి జిల్లా కో కన్వీనర్ డి.వి.ఎస్. రాజు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి జిల్లా ప్రధాన కార్యదర్శి మాజీ సర్పంచ్ చీకరమెల్లి శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రజల నుంచి సేకరించిన సమస్యలను అధికారులకు వినతిపత్రంగా అందజేశారు. రాష్ట్ర అధ్యక్షులు పి.వి.ఎన్. మాధవ్ ఆదేశాల మేరకు రాష్ట్ర జనతా వారధి బృందం రూపొందించిన నివేదిక ఆధారంగా సెప్టిక్ ట్యాంకుల నుంచి సేకరిస్తున్న మానవ మలమూత్ర వ్యర్థాల అక్రమ డంపింగ్ ను అరికట్టాలని కోరారు. ఫీకల్ స్లడ్జ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు మురుగునీటి శుద్ధి కేంద్రాల విస్తరణకు తక్షణ చర్యలు చేపట్టాలని జిల్లా జాయింట్ కలెక్టర్ వైఖోమ్ నిడియా దేవికి వినతిపత్రం సమర్పించారు. ముఖ్య అతిథి చీకరమెల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో సాగునీటి కాలువల పక్కన బహిరంగ ప్రదేశాల్లో మానవ మలమూత్ర వ్యర్థాలను అక్రమంగా పారబోస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. దీనివల్ల కాలువల నీరు కలుషితమై ప్రజలు అంటువ్యాధులకు గురవుతున్నారన్నారు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం ప్రభుత్వం ప్రతి మండలంలో ఫీకల్ స్లడ్జ్ డంపింగ్ శుద్ధి కోసం ప్రత్యేక స్థలం కేటాయించి శాస్త్రీయ పద్ధతిలో నిర్వహణకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అమలాపురం టౌన్ అధ్యక్షుడు అయ్యాల భాస్కరరావు, జనతా వారధి జిల్లా కో కన్వీనర్ ఆకుమర్తి బేబిరాణి, మైనార్టీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి మెహబూబ్ షాహేరా, అమలాపురం టౌన్ మాజీ అధ్యక్షుడు ఆరిగెల తేజ వెంకట్ తదితరులు పాల్గొన్నారు.