పయనించే సూర్యడు మే 20 సూర్యాపేట జిల్లా నడిగూడెం ప్రతినిధి పొలంపల్లి వెంకటేశ్వర్లు నడిగూడెం మండలం వల్లాపురం మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రతి రైతు తమకున్న వ్యవసాయ భూమిలో కనీసం ఒక అర ఎకరంలోనైనా తమ కుటుంబ ఆరోగ్య అవసరాల కోసం ప్రకృతి వ్యవసాయం చేయాలని తహసీల్దార్ సోంపంగు సూరయ్య కోరారు. మంగళవారం వల్లాపురంలో 'సిరి ఫౌండేషన్' ఆధ్వర్యంలో వచ్చే ఖరీఫ్ సీజన్ సందర్భాన్ని పురస్కరించుకొని ప్రకృతి వ్యవసాయంపై నిర్వహించిన రైతు చైతన్య యాత్రను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ముఖ్య అతిథులు మాట్లాడిన ముఖ్యాంశాలు: భూసారాన్ని పెంచుకుందాం: తహసీల్దార్ సూరయ్య గత 65 ఏళ్లుగా విచ్చలవిడిగా చేస్తున్న రసాయన వ్యవసాయం వల్ల భూసారం పూర్తిగా దెబ్బతిన్నదని తహసీల్దార్ ఆవేదన వ్యక్తం చేశారు. భూసారం మళ్లీ పెరగాలంటే ఇప్పటి నుంచే ప్రతి రైతు తమ నేలకు పశువుల పెంట, చెరువు మట్టిని తోలుకోవాలి. తొలకరి వర్షాలు కురవగానే జీలుగ, పిల్లిపెసర, జనుము లాంటి పచ్చిరొట్ట పంటలను సాగు చేసి భూమిలోనే కలయదున్నాలి. వరి కొయ్యలకు నిప్పు పెట్టొద్దు: ఎస్ఐ అజయ్ కుమార్ అనంతరం ఎస్ ఐ గంధమళ్ళ అజయ్ కుమార్ మాట్లాడుతూ… వరి కోతల తర్వాత కొందరు రైతులు అవగాహన లేక వరి కొయ్యకాలకు (నారళ్లకు) నిప్పంటిస్తున్నారని, ఇది సరైన పద్ధతి కాదని హెచ్చరించారు. "పంట వ్యర్థాలను తగలబెట్టడం వల్ల నేలలో పంటకు, భూమికి మేలు చేసే ఎన్నో సూక్ష్మజీవులు చనిపోతాయి. నేల ఆరోగ్యంగా ఉంటేనే పంట ఆరోగ్యంగా ఉంటుంది. పంట ఆరోగ్యమే మన అందరి ఆరోగ్యం" అని ఆయన పేర్కొన్నారు. మనిషి జీవితం ప్రకృతితోనే ముడిపడి ఉంది: డాక్టర్ హరినాధ్ పల్లెదవాఖానా వైద్యాధికారి డాక్టర్ గార్లపాటి హరినాధ్ మాట్లాడుతూ.. మనిషి జీవితం ప్రకృతితోనే ముడిపడి ఉందని, రసాయన ఆహారం వల్ల రోగాల బారిన పడుతున్నామని చెప్పారు. కాబట్టి ప్రతి రైతు సహజసిద్ధమైన వ్యవసాయం వైపు మొగ్గు చూపాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖులు: ఈ చైతన్య యాత్రలో గ్రామ సర్పంచ్ కేసగాని సరిత, పంచాయతీ కార్యదర్శి రనబోతు మల్లారెడ్డి, ఉప సర్పంచ్ కోట శేఖర్ రెడ్డి, డాక్టర్ కేసగాని లక్ష్మణ్, సిరి ఫౌండేషన్ వ్యవస్థాపకులు డాక్టర్ మొలుగూరి గోపయ్య పాల్గొన్నారు. అలాగే ఆదర్శ రైతులు బజ్జురి వీరా రెడ్డి, బజ్జురి అచ్చి రెడ్డి, పల్లా యూగేందర్ రెడ్డి, పల్లా వెంకటరెడ్డి, అప్పి రెడ్డి, నిండుచర్ల వెంకటేశ్వర్లు, దుస్సా వెంకటేశ్వర్లు, నారాయణ రెడ్డి, నూకపంగు వెంకన్న, నూకపంగు ఈదయ్య, రమేష్ గౌడ్ తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.