బగ్గుమంటున్న భానుడు.. వడగాలులతో విలవిల్లాడుతున్న జనాలు

ఎండల తీవ్రతపై అప్రమత్తంగా ఉండాలి : ఆరోగ్య సహాయకుడు కూన గోవర్ధన్

పయనించే సూర్యుడు మే 24 నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లి రిపోర్టర్ శ్రావణ్ కుమార్ రాష్ట్రంలో రోజురోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆరోగ్య సహాయకుడు కూన గోవర్ధన్ తెలిపారు. ఉపాధి హామీ కూలీలతో మాట్లాడిన ఆయన, రానున్న పక్షం రోజుల పాటు ఎండల తీవ్రతతో పాటు వడగాలులు మరింత పెరిగే అవకాశం ఉందని హెచ్చరించారు. మధ్యాహ్నం 11 గంటల నుంచి సా యంత్రం 4 గంటల వరకు అత్యవసరం ఉంటేనే బయటకు రావాలని సూచించారు. వడదెబ్బను నిర్లక్ష్యం చేస్తే ప్రాణాపాయం సంభవించే ప్రమాదం ఉందన్నారు. తరచూ నీరు, మజ్జిగ, కొబ్బరి నీళ్లు, నిమ్మరసం వంటి ద్రవాలు తీసుకోవాలని చెప్పారు. తేలికపాటి తెల్లని దుస్తులు ధరించడం, తలపాగా లేదా టోపీ వినియోగించడం మంచిదని సూచించారు. తలనొప్పి, అధిక దాహం, బలహీనత, చెమటలు రాకపోవడం, మూర్చ వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే బాధితుడిని చల్లని ప్రదేశానికి తరలించి ఓఆర్ఎస్ ద్రావణం ఇవ్వాలని తెలిపారు. అవసరమైతే 108కు సమాచారం అందించి సమీప ఆసుపత్రికి తరలించాలని సూచించారు. వృద్ధులు, చిన్నపిల్లలు, గర్భిణీలు, బీపీ, షుగర్, గుండె సంబంధిత వ్యాధులు ఉన్నవారు మరింత జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. ఇటుక బట్టీలు, ఉపాధి హామీ పనులు, రోడ్డు నిర్మాణ పనుల్లో పనిచేసే కూలీలు వడదెబ్బకు త్వరగా గురయ్యే అవకాశముందని హెచ్చరించారు.