పయనించే సూర్యుడు న్యూస్ జూన్ 9 :(సింగరేణి రిపోర్టర్ నరేష్) సింగరేణి మండలం గుంపెళ్లగూడెం, బడిబాట కార్యక్రమంలో భాగంగా గుంపెళ్లగూడెం గ్రామంలో మండల విద్యాశాఖ అధికారి (ఎంఈఓ) దుగ్గిరాల జయరాజు ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రభుత్వ పాఠశాలల ద్వారా విద్యార్థులకు అందిస్తున్న ప్రత్యేక సౌకర్యాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు ఇంగ్లీష్ మీడియం బోధన కొనసాగుతోందని, విద్యార్థులకు విద్యతో పాటు నైతిక విలువలు, సామాజిక బాధ్యతలు, క్రమశిక్షణ, పెద్దల పట్ల గౌరవం వంటి అంశాలను కూడా ఉపాధ్యాయులు బోధిస్తారని తెలిపారు. ప్రభుత్వం ఉచిత యూనిఫారాలు, పాఠ్యపుస్తకాలు, నోట్‌బుక్స్, మధ్యాహ్న భోజనం, ఉదయం అల్పాహారం వంటి పలు సౌకర్యాలను అందిస్తోందని, తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని కోరారు. అలాగే ప్రత్యేక అవసరాలు కలిగిన చిన్నారుల విద్య, సంక్షేమంపై అవగాహన కల్పిస్తూ గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలలు, భవిత కేంద్రాల్లో దివ్యాంగ విద్యార్థులకు ప్రత్యేక ఉపాధ్యాయుల ద్వారా సహిత విద్యా విధానంలో బోధనతో పాటు అనేక సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయని వివరించారు. ప్రతి దివ్యాంగ విద్యార్థి తప్పనిసరిగా ప్రభుత్వ పాఠశాలలు లేదా భవిత కేంద్రాల్లో నమోదు కావాలని సూచించారు. అనంతరం గ్రామంలోని పూర్వ ప్రాథమిక పాఠశాలను తనిఖీ చేసిన ఎంఈఓ దుగ్గిరాల జయరాజు ఉపాధ్యాయులకు పలు సూచనలు, సలహాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ గుగులోత్ కృష్ణవేణి, ఉప సర్పంచ్ భూక్యా శంకర్, గ్రామ కార్యదర్శి సంతోష్, ఉపాధ్యాయులు ఎ. శంకర్, పి. ఉమా, సీఆర్పీ లకావత్ రాములు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.