పయనించే సూర్యుడు న్యూస్, జూలై 07 (ఏలేశ్వరం మండల రిపోర్టర్ ఏ శివాజీ) : పట్టణంలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాల, కళాశాల ప్రాంగణంలో పారిశుధ్య పనులను సీతా ఈశ్వరి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సోమవారం మండల పరిషత్ అధ్యక్షుడు ట్రస్ట్ చైర్మన్ గొల్లపల్లి నరసింహమూర్తి (బుజ్జి) చేపట్టించారు. ఇటీవల కురుస్తున్న వర్షాల కారణంగా కళాశాల ప్రాంగణంలో గడ్డి,చెత్త పేరుకుపోవడంతో పారిశుధ్య సమస్య తలెత్తిందని కళాశాల ప్రిన్సిపాల్ శారద ఎంపీపీ గొల్లపల్లి బుజ్జి దృష్టికి తీసుకెళ్లారు. దీంతో స్పందించిన ఆయన సీతా ఈశ్వరి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా సొంత నిధులతో ప్రాంగణంలోని గడ్డి, చెత్తను తొలగించి పరిసరాలను పూర్తిగా శుభ్రం చేసే పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా గొల్లపల్లి బుజ్జి మాట్లాడుతూ విద్యార్థినులు పరిశుభ్రమైన, సురక్షితమైన వాతావరణంలో విద్యాభ్యాసం కొనసాగించేలా అవసరమైన పారిశుధ్య చర్యలు చేపట్టామని తెలిపారు. భవిష్యత్తులో కూడా విద్యాసంస్థల అభివృద్ధి, విద్యార్థుల సంక్షేమానికి ట్రస్ట్ తరఫున సహకారం అందిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో రామరాజు వర్మ, మండల విద్యాశాఖ అధికారి అబ్బాయి,కళాశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
.
