బూత్ గడ్డ కదిలిస్తేనే పార్టీ పటిష్టం

బూత్ స్థాయి నుంచే పార్టీ బలోపేతం చేయాలి

పయనించే సూర్యుడు జూలై 7 ముమ్మిడివరం ప్రతినిధి( గ్రంధి నానాజీ) డా. బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా భారతీయ జనతా పార్టీ పదాధికారులు, మండల అధ్యక్షులు, మండల ఇన్‌చార్జిల సమావేశం అమలాపురంలోని కాటన్ గెస్ట్ హౌస్‌లో జిల్లా అధ్యక్షులు అడబాల సత్యనారాయణ అధ్యక్షతన జరిగింది. జిల్లా ఇన్‌చార్జిగా నూతనంగా నియమితులైన కోరంకి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సమావేశానికి ముందు జనసంఘ్ వ్యవస్థాపకులు డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కోరంకి శ్రీనివాస్ మాట్లాడుతూ జిల్లాలోని అన్ని మండలాల్లో శక్తి కేంద్రాల ప్రాతిపదికన బూత్ స్థాయి నుంచి పార్టీని మరింత బలోపేతం చేయడానికి ప్రతి నాయకుడు సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. ఓటరు జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమంలో బూత్ లెవెల్ ఏజెంట్లు చురుకుగా పాల్గొని, మరణించిన ఓటర్ల పేర్లను తొలగించడం, కొత్త అర్హులైన ఓటర్లను నమోదు చేయడం, ఓటరు జాబితాను పకడ్బందీగా రూపొందించేలా కృషి చేయాలని సూచించారు. త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని పార్టీ నాయకులు, కార్యకర్తలు ఇప్పటి నుంచే సమాయత్తమై క్షేత్రస్థాయిలో పార్టీ కార్యక్రమాలను మరింత విస్తృతంగా నిర్వహించాలని ఆయన అన్నారు. ఈ సమావేశంలో మాజీ శాసనసభ్యులు మానేపల్లి అయ్యాజీ వేమా, రాష్ట్ర అధికార ప్రతినిధి నల్లా పవన్ కుమార్, గుంటూరు జిల్లా ఇన్‌చార్జి యాళ్ల దొరబాబు, సీనియర్ నాయకులు కర్రి చిట్టిబాబు, తమనంపూడి రామకృష్ణారెడ్డి, పాలూరి సత్యానందం, జిల్లా పదాధికారులు, మండల అధ్యక్షులు, మండల ఇన్‌చార్జిలు తదితరులు పాల్గొన్నారు.