పయనించే సూర్యుడు న్యూస్ , మే 21 (ఏలేశ్వరం మండల రిపోర్టర్ ఏ శివాజీ) : అనుక్షణం ఏం జరుగుతుందోనన్న భయంతో చిన్నంపేట ప్రజలు బిక్కుబిక్కుమంటూ జీవనం సాగిస్తున్నారు. ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి సురక్షితంగా వస్తామో లేదో తెలియని పరిస్థితుల్లో ప్రజలు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని ప్రయాణం చేస్తున్నారు. మృత్యువు ఎటు నుంచి దూసుకొస్తుందో తెలియని పరిస్థితులు చిన్నంపేట హైవేపై నెలకొన్నాయి. ఒకవైపు స్థానిక స్టోన్ క్వారీల నుంచి అధిక లోడుతో, అతివేగంగా దూసుకెళ్తున్న టిప్పర్లు… మరోవైపు లారీల నుంచి జారిపడుతున్న పిక్క, రాళ్లు… ఇంకోవైపు హైవే నిర్వహణలో అధికారుల నిర్లక్ష్యం… ఇవన్నీ కలిసి చిన్నంపేట హైవేను “మృత్యు మార్గం”గా మార్చేశాయని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. టిప్పర్ స్పీడ్‌కు బ్రేక్ వేయని రవాణా శాఖ మరో పెద్ద ప్రశ్నగా మారింది. అధిక వేగంతో దూసుకెళ్తున్న టిప్పర్లు నిబంధనలను ఉల్లంఘిస్తున్నా, రవాణా శాఖ తనిఖీలు, కఠిన చర్యలు తీసుకోవడంలో విఫలమైందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వేగ నియంత్రణ ఎక్కడ…? ఓవర్‌లోడ్ తనిఖీలు ఎక్కడ…? ప్రజల ప్రాణాలకు భరోసా ఎవరు…? అంటూ స్థానికులు ప్రశ్నిస్తున్నారు. వివరాల్లోకి వెళితే… కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలోని ఏలేశ్వరం మండలం చిన్నంపేట హైవేపై నిత్యం ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. స్థానిక సెంటర్‌లో సరైన లైటింగ్ లేకపోవడం, రోడ్డుమధ్య డివైడర్లు లేదా బారికేడ్లు లేకపోవడం, హైవే శుభ్రతలో నిర్లక్ష్యం కారణంగా ప్రమాదాలు మరింత పెరుగుతున్నాయి. హైవేపై పేరుకుపోయిన పిక్క, మట్టి, రాళ్లను తొలగించాల్సిన హైవే మెయింటెనెన్స్ అధికారులు చర్యలు తీసుకోవడంలో విఫలమయ్యారని ప్రజలు మండిపడుతున్నారు. ద్విచక్ర వాహనదారులు జారి పడుతూ తీవ్ర గాయాలకు గురవుతున్నారు. ప్రత్తిపాడు నుంచి ఎర్రవరం వరకు హైవే ప్రమాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిపోయిందని స్థానికులు చెబుతున్నారు. గడచిన వారం రోజుల్లోనే చిన్నంపేట హైవేపై సుమారు 15 ప్రమాదాలు చోటుచేసుకోగా, పదిమందికిపైగా ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. ప్రతి ప్రమాదం వెనుక నిర్లక్ష్యం, బాధ్యతారాహిత్యం, నియంత్రణ లోపమే కనిపిస్తోందని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. “ప్రమాదం జరిగిన తర్వాత పరామర్శలు కాదు… ప్రమాదం జరగకుండా చర్యలు కావాలి” అంటూ ప్రజలు గళమెత్తుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి హైమాస్ట్ లైట్లు, బారికేడ్లు ఏర్పాటు చేయడంతో పాటు, అధిక వేగంతో మరియు అధిక లోడుతో వెళ్లే టిప్పర్లపై రవాణా శాఖ కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. లేదంటే ప్రజల ఆగ్రహం ఉద్యమంగా మారే పరిస్థితి ఏర్పడుతుందని హెచ్చరిస్తున్నారు.