పయనించే సూర్యుడు మే 28 ఖమ్మం జిల్లా బ్యూరో గుగులోత్ భావుసింగ్ నాయక్ ఖమ్మం జిల్లా వ్యాప్తంగా అడవులకు ఆనుకుని ఉన్న వ్యవసాయ భూముల్లో రైతులు పంట అవశేషాలకు నిప్పు పెడుతున్నారు. ఆ మంటలు అదుపుతప్పి సమీపంలోని అటవీ ప్రాంతానికి వ్యాపించడంతో అడవి కాలి బూడిదవుతోంది. విలువైన వృక్ష సంపదతో పాటు అడవిలో నివసించే మూగజీవాలు సైతం మంటల్లో చిక్కుకుని సజీవ దహనమవుతున్నాయి. నిప్పు పెట్టిన వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని పర్యావరణవేత్తలు, ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఈ తరహా ఘటనలు ఎక్కువగా వెలుగుచూస్తున్నాయి. మొక్కజొన్న, వరి కోతలు పూర్తయిన తర్వాత రైతులు పొలాలను త్వరగా సిద్ధం చేసుకునేందుకు మొదళ్లకు నిప్పు అంటిస్తున్నారు. వేసవి ఎండ తీవ్రత, బలమైన గాలులకు మంటలు అడవుల్లోకి చొచ్చుకుపోతున్నాయి. అటవీ ప్రాంతం అగ్నికి ఆహుతైనట్లు అంచనా.
వన్యప్రాణులు:
అడవిలోని నెమళ్లు, దుప్పులు, కుందేళ్లు, పాములు, తాబేళ్లు వంటి మూగజీవాలు మంటల నుండి తప్పించుకోలేక సజీవంగా కాలిపోతున్నాయి. పక్షి గూళ్లు, గుడ్లు పూర్తిగా నాశనమవుతున్నాయి.
. పర్యావరణ విధ్వంసం:
అడవులు కాలిపోవడంతో వర్షపాతం తగ్గడం, భూగర్భ జలాలు అడుగంటడం, ఉష్ణోగ్రతలు పెరగడం వంటి దుష్ప్రభావాలు తలెత్తుతున్నాయి. కార్బన్ ఉద్గారాలు విపరీతంగా పెరిగి కాలుష్యం పెరుగుతోంది.
అధికారుల నిర్లక్ష్యం:
“ఏటా వేసవిలో ఇదే పరిస్థితి. అయినా అటవీశాఖ ముందస్తు చర్యలు తీసుకోవడం లేదు. ఫైర్ లైన్స్ ఏర్పాటు చేయలేదు, బీట్ గార్డులతో నిఘా పెట్టలేదు. గ్రామాల్లో అవగాహన సదస్సులు నిర్వహించలేదు” అని స్థానికులు ఆరోపించారు. ఫిర్యాదు చేసినా స్పందించడం లేదని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిప్పు పెట్టిన రైతులను గుర్తించి వెంటనే అరెస్టు చేసి, కోర్టులో కఠిన శిక్ష పడేలా చూడాలి. కాలిపోయిన అటవీ ప్రాంతంలో వెంటనే మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టాలి. అటవీ సరిహద్దు గ్రామాల్లో ఫైర్ ప్రొటెక్షన్ కమిటీలు వేసి, రైతులకు ప్రత్యామ్నాయ పద్ధతులపై అవగాహన కల్పించాలి. విధుల్లో నిర్లక్ష్యం వహించిన అటవీశాఖ సిబ్బందిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలి.