జనం న్యూస్ జూన్ 07 గోరంట్ల మండల ప్రతినిధి పక్రోద్దీన్: కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టనున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ ఐ ఆర్ ప్రక్రియపై తెలుగుదేశం పార్టీ నాయకులు, బూత్ స్థాయి కార్యకర్తలకు అవగాహన కల్పించేందుకు రెండో రోజు శిక్షణా సమావేశం శనివారం గోరంట్లలో నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీసీ సంక్షేమ, ఈడబ్ల్యూఎస్, చేనేత & జౌళి శాఖల మంత్రి సవితమ్మ ఆదేశాల మేరకు, గోరంట్ల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో టీడీపీ మండల కన్వీనర్ గుత్తా బాలకృష్ణ చౌదరి ఆధ్వర్యంలో ఈ సమావేశం జరిగింది. మల్లాపల్లి, పాలసముద్రం, వడిగేపల్లి, రెడ్డిచెరువుపల్లి, గంగంపల్లి, పులేరు, కమ్మవారిపల్లి, వెంకటరమణపల్లి గ్రామ పంచాయతీల అధ్యక్షులు, నాయకులు, క్లస్టర్ ఇన్చార్జీలు, కో-యూనిట్ ఇన్చార్జీలు, బూత్ కన్వీనర్లు, బూత్ లెవల్ ఏజెంట్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గుత్తా బాలకృష్ణ చౌదరి మాట్లాడుతూ, “ప్రతి ఓటు కీలకమే” అని పేర్కొంటూ, ఎస్ఐఆర్ ప్రక్రియను ప్రతి ఒక్కరూ అత్యంత బాధ్యతతో తీసుకోవాలని సూచించారు. కేంద్ర ఎన్నికల సంఘం ఈ నెల 15వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టనున్న నేపథ్యంలో క్షేత్రస్థాయిలో పార్టీ శ్రేణులు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. ప్రతి 20 నుంచి 25 ఏళ్లకోసారి ప్రత్యేక ఓటరు జాబితా సవరణ ప్రక్రియ నిర్వహిస్తారని, 2002 ఓటర్ల జాబితాను ప్రామాణికంగా తీసుకుని ఈసారి ఎస్ఐఆర్ చేపడుతున్నారని వివరించారు. జూలై 14వ తేదీలోగా రెండుసార్లు ఓటర్ల మ్యాపింగ్ నిర్వహించనున్నట్లు తెలిపారు. అలాగే జూలై 15 నుంచి ఆగస్టు నెలాఖరు వరకు ఇంటింటి ప్రచారం చేపట్టి ఓటర్లకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. ఓటర్ల నమోదు, మార్పులు, చేర్పుల విషయంలో నిర్లక్ష్యం చేస్తే అర్హులైన ఓటర్ల పేర్లు జాబితాలో లేకపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ప్రజలకు ఓటు నమోదు ప్రక్రియపై అవగాహన కల్పించడం రాజకీయ పార్టీల ప్రాథమిక బాధ్యత అని పేర్కొన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని గత ఎన్నికల్లో పనిచేసిన తీరులోనే పార్టీ శ్రేణులు సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర హస్తకళ డైరెక్టర్ సోమశేఖర్ జిల్లా ఉపాధ్యక్షుడు సుధాకర్ రెడ్డి, జిల్లా కార్యదర్శి నరేష్ కుమార్, సింగల్ విండో అధ్యక్షుడు బెల్లాలచెరువు చంద్ర పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, వివిధ హోదాల్లో ఉన్న పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.