మధిరలో మెడికల్ షాపుల బంద్ సంపూర్ణం

పయనించే సూర్యుడు న్యూస్ మే 21 మధిర ప్రతినిధి ఆల్ ఇండియా కెమిస్ట్స్ అండ్ డ్రగ్గిస్ట్స్ ఆధ్వర్యంలో బుధవారం దేశవ్యాప్తంగా నిర్వహించిన బంద్‌కు మధిరలో విశేష స్పందన లభించింది. పట్టణంలోని మెడికల్ షాపులన్నీ స్వచ్ఛందంగా మూసివేసి నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షుడు బి. గోవర్ధన్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి కె. శ్రీనివాసరావు, కోశాధికారి వై. శ్రీనివాసరావు మాట్లాడుతూ ఫార్మసీ రంగాన్ని ప్రభావితం చేస్తున్న పలు కీలక సమస్యల పరిష్కారం కోసం ఈ బంద్ చేపట్టినట్లు తెలిపారు. అక్రమ ఈ-ఫార్మసీల నియంత్రణ, మందులపై భారీ డిస్కౌంట్ల నియంత్రణ, జీఎస్‌ఆర్ 220(ఈ) నిబంధనల అమలు వంటి అంశాలపై ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఆన్‌లైన్ ద్వారా అక్రమంగా మందుల విక్రయాలు పెరగడంతో చిన్న, మధ్య తరహా మెడికల్ షాపులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రోగుల భద్రత, నాణ్యమైన ఔషధాల సరఫరా, ఫార్మసీ రంగ పరిరక్షణ కోసమే ఈ బంద్ నిర్వహించామని నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు దొడ్డ మురళి, వై. రాము, వెచ్చ శ్రీను, వి. అనంత రామయ్య, కె. వంశీ, జి. రామ శ్రీను, వెంకట్, సాగర్ శ్రీను, మెడికల్ షాపుల యజమానులు తదితరులు పాల్గొన్నారు.