మరో పంచాయతీ కార్మికుడు – బొండాడ కోటేశ్వరరావు మృతి – ఆందోళనలో సర్పవరం కార్మికులు.

కార్మికులకు న్యాయం చేయాలి, గ్రామ పంచాయతీ యూనియన్ డిమాండ్..

పయనించే సూర్యుడు జూన్ 4, కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ (బి వి బి) కాకినాడ రూరల్ నిన్న కొవ్వాడ ,రేపూరు , గంగనాపల్లి పంచాయతీ కార్మికుల ఆందోళన గడవక ముందే నేడు సర్పవరం గ్రామపంచాయతీ కార్మికుడు బొండాడ కోటేశ్వరరావు (57 ) మృతితో బుధవారం సర్పవరం గ్రామపంచాయతీ కార్మికులు ఆందోళన బాటను చేపట్టారు. జిల్లా కలెక్టర్ వారు, పంచాయతీ అధికారులు కార్మికుల న్యాయమైన సమస్యలను వెంటనే పరిష్కరించాలని, పి ఎఫ్, ఈ ఎస్ ఐ లాంటి సంక్షేమ పథకాలను నిర్లక్ష్యం చేయకుండా అధికారులు అమలు చేయాలని ఎ పి గ్రామపంచాయతీ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ ( సి ఐ టి యి) రూరల్ కార్యదర్శి చింతపల్లి అజయ్ కుమార్, సిఐటియు రూరల్ కార్యదర్శి తొట్టపూడి రాజాలు డిమాండ్ చేశారు. గత మూడు దశాబ్దాలకు పైగా పారిశుద్ధ్య విధులు నిర్వహిస్తున్న ఈకార్మికులకు పి ఎఫ్, ఈ ఎస్ ఐ లాంటి సంక్షేమ పథకాలు ఎందుకు అమలు చేయడం లేదని ? వారు ప్రశ్నించారు. ఈసంక్షేమ పథకాలు కార్మికులకు అమలు చేయకపోవడం వలన ఒక్క సర్పవరం గ్రామపంచాయతీలోనే 2025, 26 సంవత్సరంలోనే బొండాడ కోటేశ్వరరావు, గుర్రం అప్పన్న, ముత్యాల నాగరాజు, కట్ట ఆనంద , బొండాడ సత్యనారాయణలు ఈ ఐదుగురు మరణించారు. అతి తక్కువ జీతాలతో పని చేసే వీరికి ఎలాంటి సంక్షేమ పథకాలు అమలు కాకపోవడంతో ఆకుటుంబ పెద్ద మరణిస్తే ఆ కుటుంబమే అనాధలవుతున్నది. దీనికి స్థానిక అధికారులు పూర్తిగా బాధ్యత వహించాలని, ఈకుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని మరణించిన కుటుంబంలో ఒకరికి ఉద్యోగం, ఎక్స్ గ్రేషియో చెల్లించాలని అజయ్ కుమార్ డిమాండ్ చేశారు. కలెక్టర్ జోక్యం చేసుకొని పి ఎఫ్ , ఈ ఎస్ ఐ పథకాలు , మూడు నెలల బకాయి జీతాలు, సంవత్సర కాలంగా ఇవ్వాల్సిన జీతాల ఎరియర్స్ లను వెంటనే ఇప్పించాలని వారు డిమాండ్ చేశారు.