పయనించే సూర్యడు మే 30 సూర్యాపేట జిల్లా నడిగూడెం ప్రతినిధి పొలంపల్లి వెంకటేశ్వర్లు నడిగూడెం కోదాడ నియోజకవర్గం నడిగూడెం మండలం బృందావనపురం గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. బృందావనపురం గ్రామానికి చెందిన ప్రముఖ నాయకుడు, మాజీ ఎంపీటీసీ సభ్యుడు గోలి వెంకన్న మాతృమూర్తి గోలి లక్ష్మమ్మ గురువారం సాయంత్రం అనారోగ్యంతో కన్నుమూశారు. లక్ష్మమ్మ మరణవార్త విన్న వెంటనే కోదాడ మాజీ శాసనసభ్యుడు బొల్లం మల్లయ్య యాదవ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. శుక్రవారం బృందావనపురం గ్రామంలోని గోలి వెంకన్న నివాసానికి చేరుకున్న మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్, లక్ష్మమ్మ భౌతికకాయాన్ని సందర్శించి, పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం, మాతృమూర్తిని కోల్పోయి తీవ్ర పుత్రశోకంలో ఉన్న గోలి వెంకన్నను, వారి కుటుంబ సభ్యులను బొల్లం మల్లయ్య యాదవ్ ఓదార్చారు. లక్ష్మమ్మ ఆత్మకు సద్గతి చేకూరాలని, ఆ భగవంతుడు వారి కుటుంబానికి ఈ కష్ట కాలంలో ధైర్యాన్ని ప్రసాదించాలని ఆయన ఆకాంక్షించారు. పరామర్శించిన ప్రముఖులు: గోలి వెంకన్న కుటుంబాన్ని పరామర్శించిన వారిలో మాజీ ఎమ్మెల్యేతో పాటు నడిగూడెం మండల పార్టీ అధ్యక్షుడు పల్లా నర్సిరెడ్డి, నియోజకవర్గ సమన్వయ కమిటీ సభ్యుడు అనంతల ఆంజనేయులు, బృందావనపురం గ్రామ శాఖ అధ్యక్షుడు కాసాని ఉపేందర్, పార్టీ ముఖ్య నాయకులు నాగేశ్వరరావు, దాసరి శ్రీను, జలీల్ మేకల వీరబాబు ఉద్యమకారుడు రఫీ తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా మండల నాయకులందరూ గోలి వెంకన్నను, వారి కుటుంబ సభ్యులను కలిసి తమ ఘన నివాళులు అర్పిస్తూ సానుభూతిని తెలియజేశారు. లక్ష్మమ్మ మృతితో బృందావనపురం గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.