పయనించే సూర్యడు / మే 22/ ఉప్పల్ ప్రతినిధి సింగం రాజు మాదకద్రవ్యాల మత్తులో చిక్కుకుని యువత తమ బంగారు భవిష్యత్తును అంధకారంలోకి నెట్టుకోవద్దు అని కాప్రా సర్కిల్ డిప్యూటీ కమిషనర్ హెచ్చరించారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా చేపట్టిన 99 రోజుల కార్యక్రమంలో భాగంగా, కుషాయిగూడ పద్మావతి కాలనీ ప్లే గ్రౌండ్లో గురువారం 'యాంటీ డ్రగ్స్'పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్థానిక యువత, విద్యార్థులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా డిప్యూటీ కమిషనర్ మాట్లాడుతూ.. నేటి తరుణంలో డ్రగ్స్ అలవాటు పెను సవాలుగా మారిందని పేర్కొన్నారు. మాదకద్రవ్యాల వల్ల వ్యక్తిగత ఆరోగ్యం దెబ్బతినడమే కాకుండా, కుటుంబాలు చిన్నాభిన్నమవుతున్నాయి. వ్యక్తిగత ప్రగతి లేనిదే సమాజం, దేశం అభివృద్ధి చెందడం అసాధ్యం. మత్తుకు బానిసలయ్యే ప్రతి ఒక్కరూ దేశ భవిష్యత్తును ప్రమాదంలోకి నెట్టినట్లే అని స్పష్టం చేశారు. పిల్లల విషయంలో తల్లిదండ్రులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పిల్లలు ఎవరితో స్నేహం చేస్తున్నారు? వారి అలవాట్లు ఎలా ఉన్నాయి? అనే అంశాలపై నిరంతరం నిఘా ఉంచాలి. తల్లిదండ్రుల పర్యవేక్షణే పిల్లలను చెడు మార్గాల నుండి రక్షించే మొదటి కవచం అని చెప్పారు. అలాగే, డ్రగ్స్ రవాణా, విక్రయాలను అరికట్టడంలో పోలీసు యంత్రాంగం నిఘా వ్యవస్థను మరింత పటిష్టం చేయాలని కోరారు. సమాజంలోని ప్రతి పౌరుడు బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ, మాదకద్రవ్యాల రహిత సమాజం కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సానిటరీ సూపర్వైజర్ సుదర్శన్, ఉప్పల్ జోన్ స్పోర్ట్స్ ఇంచార్జ్ విగ్నేష్, పలువురు కాలనీ ప్రతినిధులు, విద్యార్థులు, యువకులు పాల్గొన్నారు.