పయనించే సూర్యుడు వాత్సవాయి మండలం రిపోర్టర్ తమ్మిశెట్టి వెంకట్రావు ఎన్టీఆర్ జిల్లా జగయ్యపేట్ట నియోజకవర్గం జూన్ 4 వత్సవాయి మండలం పోలంపల్లి గ్రామం మున్నేరు ఆనకట్ట మరమ్మత్తులకు రూ.21.50 కోట్ల నిధులు విడుదల చేయాలని విజ్ఞప్తి 30 వేల ఎకరాల ఆయకట్టు రైతుల ప్రయోజనాల దృష్ట్యా తక్షణ చర్యలు చేపట్టాలని వినతి జగ్గయ్యపేట శాసనసభ్యులు మరియు తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య) ఈరోజు విజయవాడలోని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి పోలంపల్లి మున్నేరు ఆనకట్టకు సంబంధించిన అత్యవసర సమస్యలను వారి దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పోలంపల్లి మున్నేరు ఆనకట్ట ప్రస్తుత పరిస్థితిని మంత్రివర్యులకు వివరించారు. ఆనకట్టకు అవసరమైన శాశ్వత మరమ్మత్తుల కోసం ఇప్పటికే ప్రతిపాదించిన రూ.21.50 కోట్ల నిధులను తక్షణమే మంజూరు చేసి పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. మున్నేరు ఆనకట్టపై ఆధారపడి జగ్గయ్యపేట, పెనుగంచిప్రోలు మరియు వత్సవాయి మండలాలకు చెందిన సుమారు 30 వేల ఎకరాల వ్యవసాయ భూములకు సాగునీరు అందుతున్న నేపథ్యంలో, ఆనకట్ట బలోపేతం అత్యంత అవసరమని వివరించారు. ప్రస్తుతం ఖరీఫ్ సీజన్ సమీపిస్తున్న తరుణంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఆనకట్ట మరమ్మత్తులు పూర్తయ్యే వరకు తాత్కాలిక రక్షణ చర్యలుగా రింగ్ బండ్లు నిర్మించేందుకు అవసరమైన అనుమతులను కూడా వెంటనే మంజూరు చేయాలని కోరారు. రింగ్ బండ్లు నిర్మించడం ద్వారా వరదల ప్రభావం తగ్గి, ఆనకట్ట భద్రతతో పాటు రైతుల సాగునీటి అవసరాలు కూడా నిరాటంకంగా కొనసాగుతాయని తెలిపారు. మున్నేరు ఆనకట్ట పరిధిలోని వేలాది మంది రైతుల జీవనాధారం వ్యవసాయమేనని, ఆనకట్ట మరమ్మత్తులు ఆలస్యం అయితే సాగునీటి సరఫరాపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని మంత్రివర్యులకు వివరించారు. రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని నిధుల మంజూరు, పరిపాలనా అనుమతులు మరియు సాంకేతిక ఆమోదాలు త్వరితగతిన పూర్తి చేయాలని విజ్ఞప్తి చేశారు. ఎమ్మెల్యే వినతిపై సానుకూలంగా స్పందించిన జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు సంబంధిత అధికారులతో సమీక్షించి అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు తెలిపారు. మున్నేరు ఆనకట్ట బలోపేతం ద్వారా మూడు మండలాలకు చెందిన రైతాంగానికి దీర్ఘకాలికంగా ప్రయోజనం చేకూరుతుందని, ప్రభుత్వం రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉందని ఎమ్మెల్యే ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్నేరు డ్యామ్ చైర్మన్ పొన్నం బాలాజీ, వైస్ చైర్మన్ చిట్లూరి మౌళిశ్వరరావు, తోట నాగమల్లేశ్వరరావు, ఉప్పుకొండూరి గురు ప్రసాద్, సూరంపల్లి అప్పారావు, అబ్బూరి వెంకటేశ్వరరావు, దేవినేని శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.