పయనించే సూర్యుడు జూన్ 06, (చింతకాని మండలం రిపోర్టర్. వేర్పుల కోటేశ్వరరావు ) చింతకాని, జూన్ 5: మొక్కజొన్న రైతులు పండించిన చివరి గింజ వరకు కొనుగోలు చేసి రైతుల పక్షపాతిగా నిలిచిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతూ శుక్రవారం చింతకాని మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పాలాభిషేక కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చిత్రపటాలకు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కన్నెబోయిన గోపి యాదవ్, మత్కేపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ అంబటి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో పాలాభిషేకం చేశారు.ఈ సందర్భంగా గోపి యాదవ్ మాట్లాడుతూ, చింతకాని మండలంలో సుమారు 6.50 లక్షల క్వింటాళ్ల మొక్కజొన్న కొనుగోళ్లు విజయవంతంగా నిర్వహించామని తెలిపారు. నాగులవంచ సొసైటీ ద్వారా 2.50 లక్షల క్వింటాళ్లు, చింతకాని సొసైటీ ద్వారా 4 లక్షల క్వింటాళ్ల మొక్కజొన్న కొనుగోలు చేయగా, రైతులకు సుమారు రూ.150 కోట్ల మేర లబ్ధి చేకూరిందని వివరించారు.మొక్కజొన్న రైతుల సంక్షేమం విషయంలో తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు చారిత్రాత్మకమైనవని ఆయన పేర్కొన్నారు. దేశంలోని పలు రాష్ట్రాల్లో రైతులు తమ పంటలకు గిట్టుబాటు ధర కోసం ఆందోళనలు చేస్తున్న సమయంలో, తెలంగాణ ప్రభుత్వం మాత్రం రైతు పండించిన ప్రతి గింజకు విలువ దక్కేలా కొనుగోళ్లు నిర్వహించిందన్నారు.వ్యవసాయం తెలంగాణ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక అని, రైతు బాగుంటేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని అన్నారు. ఈ ఏడాది మొక్కజొన్న దిగుబడి అధికంగా వచ్చిన నేపథ్యంలో మార్కెట్ ధరలు పడిపోయే పరిస్థితి ఉన్నప్పటికీ, రైతులు నష్టపోకుండా ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ముందస్తు చర్యలు చేపట్టిందని తెలిపారు.రైతుబంధు, రైతు బీమా వంటి సంక్షేమ పథకాలతో పాటు పంట కొనుగోళ్లలోనూ రైతులకు పూర్తి రక్షణ కల్పిస్తున్న ప్రభుత్వం రైతు సంక్షేమానికి కట్టుబడి ఉందని గోపి యాదవ్ అన్నారు. పంటకు ముందు పెట్టుబడి సహాయం, సాగుకు అవసరమైన విద్యుత్, నీటి సౌకర్యాలు, పంట అనంతరం గిట్టుబాటు ధరతో కొనుగోలు వంటి సమగ్ర రైతు సంక్షేమ విధానాలతో తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలుస్తోందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ కొప్పుల గోవిందరావు, అబ్దుల్ నబీ, నన్నాక శ్రీనివాసరావు, చింతకాని సొసైటీ అధ్యక్షుడు శేఖర్ రెడ్డి, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు బందెల నాగార్జున, ఎస్కే కాసిం, మండల కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి కూరపాటి కిషోర్, యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు కంచమూర్తి రామకృష్ణ, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు తోటకూరి ప్రగతి, సోషల్ మీడియా కోఆర్డినేటర్ అనిల్ కుమార్ వేర్పుల, మాజీ ఎంపీటీసీ బొర్రా ప్రసాద్, సేవాదళ్ అధ్యక్షుడు పరసగాని సతీష్, సర్పంచులు లోయ ఉపేందర్, ఆవుల నాగేశ్వరరావు, వంగూరి రమేష్, అంబటి శరత్, ఎస్సీ సెల్ అధ్యక్షుడు వనం చెన్నప్ప, కంచం కోటేశ్వరావు, పగడాల రాధాకృష్ణ నాయుడు, బొల్లికొండ రామారావు, మరీదు రామకృష్ణ, తాళ్లూరి రమేష్, కర్రి వెంకటేశ్వర్లు తదితర కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.