పయనించే సూర్యుడు: చోడవరం, జూన్ 13: రి పోర్టర్ శ్రవణ్ రాజ్ చోడవరం మండలం అనకా పల్లి జిల్లా "మనబడి – మన పండగ" కార్యక్రమంలో భాగంగా బాలికల ఉన్నత పాఠశాల, చోడవరంలో నిర్వహించిన కార్యక్రమానికి అనకాపల్లి జిల్లా విద్యాశాఖ అధికారి గిడ్డి అప్పారావు నాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నూతన విద్యా సంవత్సరం ప్రారంభ సందర్భంగా పాఠశాలకు వచ్చిన విద్యార్థులను ఫైవ్ స్టార్ చాక్లెట్లు, ఆపిల్స్ అందించి ఆత్మీయంగా స్వాగతించారు. అనంతరం విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో అందిస్తున్న నాణ్యమైన, ఆధునిక విద్యను పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఇటీవల ప్రైవేట్ పాఠశాలల నుంచి ప్రభుత్వ హైస్కూల్లో చేరిన విద్యార్థులతో ప్రత్యేకంగా మాట్లాడిన డీఈఓ , ప్రభుత్వ పాఠశాలలు నేడు ప్రైవేట్ విద్యాసంస్థలకు ఏమాత్రం తీసిపోకుండా మెరుగైన విద్య, మౌలిక సదుపాయాలు, ప్రతిభాభివృద్ధికి అనుకూలమైన వాతావరణాన్ని అందిస్తున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో అత్యంత ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది డీఈఓ నిరాడంబరత. ప్రభుత్వం విద్యార్థులకు అందించే యూనిఫామ్‌ను తన సొంత ఖర్చుతో కుట్టించుకొని, అదే యూనిఫామ్ ధరించి విద్యార్థుల మధ్య ఒక విద్యార్థిలా కలిసిమెలసి పాల్గొన్నారు. ఈ దృశ్యం విద్యార్థులను మాత్రమే కాకుండా ఉపాధ్యాయులను సైతం ఆశ్చర్యానికి గురిచేసింది. విద్యార్థుల్లో ప్రభుత్వ పాఠశాలల పట్ల గౌరవం, అనుబంధం పెంపొందించాలనే ఆయన సంకల్పానికి ఇది నిదర్శనంగా నిలిచింది. జిల్లా వ్యాప్తంగా పాఠశాలల బలోపేతం, విద్యార్థుల నమోదు పెంపు లక్ష్యంగా డీఈఓ గిడ్డి అప్పారావు నాయుడు ఇటీవల అనేక మండలాలు, గ్రామాలను సందర్శిస్తూ ఎన్రోల్మెంట్ డ్రైవ్‌లో చురుకుగా పాల్గొంటున్నారు. వేసవి సెలవుల కాలంలో కూడా విశ్రాంతి తీసుకోకుండా పాఠశాలల అభివృద్ధి, విద్యార్థుల చేరికల పెంపు, విద్యా ప్రమాణాల మెరుగుదల కోసం పూర్తి సమయాన్ని వెచ్చించడం విశేషం. ప్రభుత్వ పాఠశాలల పట్ల ప్రజల్లో విశ్వాసాన్ని పెంపొందించేందుకు, నింపేందుకు ఆయన చేస్తున్న కృషి జిల్లా వ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటోంది. చిత్రం లో విద్యార్థుల తో డి ఈ ఓ