రామగుండం-2 ఏరియాలోని తోటమాలి టెండర్లు వెంటనే పిలవాలి

★ ఐ ఎఫ్ టి యు ఆధ్వర్యంలో ధర్నా

పయనించే సూర్యుడు న్యూస్ | పెద్దపల్లి, సెంటినరీ కాలనీ | జూలై-07:- రామగుండం-2 డివిజన్‌లో తోటమాలి టెండర్లను వెంటనే పిలిచి కార్మికులకు ప్రతిరోజూ పూర్తి స్థాయిలో ఉపాధి కల్పించాలని సింగరేణి కాలరీస్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ఐఎఫ్టియు డిమాండ్ చేసింది. ఈ మేరకు సోమవారం నిర్వహించిన ధర్నా అనంతరం జీఎం బండి వెంకటయ్యకు యూనియన్ నాయకులు వినతిపత్రం అందజేశారు.యూనియన్ నాయకులు మాట్లాడుతూ, ఆర్జీ-2 డివిజన్‌లో తోటమాలి టెండర్ల అంశాన్ని ఇప్పటికే పలుమార్లు జనరల్ మేనేజర్, డైరెక్టర్ దృష్టికి తీసుకెళ్లినా ఇప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కొత్త టెండర్లు ఖరారయ్యే వరకు మాస్టర్ బేసిక్ విధానంలో ప్రత్యేక టెండర్ పిలిచి తోటమాలి కార్మికులకు నిరంతర ఉపాధి కల్పించాలని కోరారు.ఈ సందర్భంగా ఐఎఫ్‌టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏ. వెంకన్న, రాష్ట్ర ఉపాధ్యక్షుడు బి. అశోక్ మాట్లాడుతూ, ఆర్జీ-2 పరిధిలోని తోటమాలి కార్మికులు గత జనవరి నుంచి పనులు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. యాజమాన్యంలోని సమన్వయ లోపం వల్లే టెండర్ల ప్రక్రియ ఆలస్యమవుతోందని విమర్శించారు. వెంటనే టెండర్లు పిలిచి కార్మికులకు ఉపాధి కల్పించాలని, లేనిపక్షంలో సింగరేణి వ్యాప్తంగా తోటమాలి కార్మికులతో కలిసి పెద్దఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.ధర్నా కార్యక్రమంలో ఐఎఫ్‌టీయూ నాయకులు చంద్రగిరి లింగయ్య, సీహెచ్. శంకర్, మల్లికార్జున్, ఎం. రమా, రాజేశ్వరి, లక్ష్మి, ఎం. దుర్గయ్య తదితరులు పాల్గొన్నారు.

.