రైతులను విస్మరిస్తున్న కేంద్ర ప్రభుత్వం – పెంచిన ఎరువుల ధరలు తగ్గించాలి

పయనించే సూర్యుడు న్యూస్ జూన్ 7: (సింగరేణి రిపోర్టర్ నరేష్) వ్యవసాయానికి అవసరమైన విత్తనాలు పూర్తి సబ్సిడీపై అందించాలి: అఖిలభారత ఐక్య రైతు సంఘం సింగరేణి, జూన్ 6: రైతాంగ సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ అఖిలభారత ఐక్య రైతు సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం సింగరేణి మండల డిప్యూటీ తహసీల్దార్‌కు వినతిపత్రం సమర్పించారు. సంఘం ఆల్ ఇండియా కమిటీ పిలుపులో భాగంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో రైతుల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా సంఘం డివిజన్ కార్యదర్శి గుగులోతు తేజ నాయక్ మాట్లాడుతూ, 2026 వ్యవసాయ సీజన్ ప్రారంభంలో ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించిందన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రైతులకు అవసరమైన అన్ని రకాల విత్తనాలను పూర్తి సబ్సిడీపై అందించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో 7.46 లక్షల క్వింటాళ్ల వరి విత్తనాలు అవసరమవుతుండగా, కేవలం 1.62 లక్షల క్వింటాళ్లను మాత్రమే సబ్సిడీపై సరఫరా చేయడం సరైన విధానం కాదన్నారు. జొన్న, మొక్కజొన్న, చిరుధాన్యాలు, పప్పుధాన్యాలు, సెనగ, వేరుశెనగ, నువ్వులు, మినుములు, కందులు తదితర పంటల విత్తనాలను కూడా రైతులకు పూర్తిస్థాయిలో సబ్సిడీపై అందించాలని కోరారు. ఏజెన్సీ ప్రాంతాల్లో 90 శాతం సబ్సిడీపై విత్తనాలు అందించాల్సిన నిబంధనలు ఉన్నప్పటికీ, కారేపల్లి తదితర మండలాల్లో రైతులకు తగినంతగా అందడం లేదని విమర్శించారు. రైతులందరికీ అవసరమైన విత్తనాలను సకాలంలో అందించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం డివిజన్ కమిటీ సభ్యులు పుల్లకాని సత్తిరెడ్డి, జిల్లా కమిటీ సభ్యుడు వడ్డే వెంకటేశ్వర్లు, మండల కమిటీ సభ్యుడు బాల్‌బి బాలు నాయక్, ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం డివిజన్ కమిటీ సభ్యుడు రావుల నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.