రైతు ఆశీర్వాద సభను చరిత్రలో నిలిచేలా విజయవంతం చేయాలి

★ అప్పాయిగూడెం రైతు వేదికలో భారీ సన్నాహక సమావేశం ★ రైతుబంధు సాయం రైతుల ఖాతాల్లోనే జమ ఎమ్మెల్యే రాందాస్ నాయక్

పయనించే సూర్యుడు న్యూస్ – జూలై 9 సింగరేణి రిపోర్టర్ : గుగులోత్ నరేష్ నాయక్ సింగరేణి: రైతు సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని, ఈ నెల 10న చింతకాని మండలం జగన్నాధపురం ఎక్స్‌రోడ్డులో నిర్వహించనున్న రైతు ఆశీర్వాద సభను నియోజకవర్గ చరిత్రలో నిలిచేలా చారిత్రాత్మక విజయవంతం చేయాలని వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ పిలుపునిచ్చారు. బుధవారం సింగరేణి మండల కేంద్రంలోని అప్పాయిగూడెం రైతు వేదికలో మండల స్థాయి అధికారులు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులతో కలిసి రైతు ఆశీర్వాద సభ ఏర్పాట్లపై ఎమ్మెల్యే సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ముఖ్యమంత్రి పాల్గొనే ఈ సభను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని సూచించారు. నియోజకవర్గంలోని ప్రతి గ్రామం నుంచి రైతులు, కాంగ్రెస్ శ్రేణులు భారీ సంఖ్యలో పాల్గొనేలా కార్యాచరణ రూపొందించాలని అధికారులను ఆదేశించారు. సభకు హాజరయ్యే రైతులకు రవాణా, తాగునీరు, పారిశుధ్యం, కూర్చునే వసతి, ట్రాఫిక్ నియంత్రణ, భద్రత తదితర ఏర్పాట్లను పకడ్బందీగా చేయాలని సూచించారు. ఎమ్మెల్యే రాందాస్ నాయక్ మాట్లాడుతూ, రైతు పక్షపాత కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీల అమలులో కట్టుబడి ఉందన్నారు. ప్రస్తుత ఖరీఫ్ సీజన్‌కు సంబంధించిన రైతుబంధు పెట్టుబడి సాయాన్ని నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నట్లు తెలిపారు. రైతుల అభ్యున్నతికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, రైతు ఆశీర్వాద సభ కూడా ఆ సంకల్పానికి ప్రతీకగా నిలుస్తుందని పేర్కొన్నారు. సభ విజయవంతానికి అధికారులు, ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు సమిష్టిగా కృషి చేయాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. నియోజకవర్గంలోని అన్ని గ్రామాల నుంచి రైతులు, కాంగ్రెస్ శ్రేణులు భారీగా తరలివచ్చి సభను విజయవంతం చేయడానికి సిద్ధంగా ఉన్నారని ఆయన తెలిపారు. ఈ సమావేశంలో రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరావు, సొసైటీ చైర్మన్ దుగ్గినేని శ్రీనివాస్, తహసీల్దార్ వెంకటేశ్వర్లు, ఎంపీడీఓ పద్మావతి, ఎంపీవో రవీంద్రప్రసాద్, వ్యవసాయ అధికారి అశోక్ కుమార్, సెర్ప్ ఏపీఎం వెంకటేశ్వర్లు, ఎస్‌ఐ గోపి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు రాంబాబు, జిల్లా నాయకులు రామ్మూర్తి నాయక్, చంద్రప్రకాష్, సురేందర్ మనియర్, మండల సర్పంచ్‌లు, ఏఈఓలు, పంచాయతీ కార్యదర్శులు, జీపీఓలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.