రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు ముగింపు కార్యక్రమం

పయనించే సూర్యుడు న్యూస్ మే 24 అశ్వారావుపేట మండలం రిపోర్టర్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట వ్యవసాయ కళాశాల ఆధ్వర్యంలో రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమం ముగింపు సభను మల్లాయిగూడెం గ్రామపంచాయతీలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని డా. ఆర్. శ్రీనివాసరావు అగ్రానమీ శాస్త్రవేత్త మరియు డా. కె. శిరీష విస్తరణ శాస్త్రవేత్త సమన్వయం చేశారు. కార్యక్రమంలో రైతులకు శాస్త్రీయ వ్యవసాయ పద్ధతులపై అవగాహన కల్పించారు. డా. ఆర్. శ్రీనివాసరావు రైతులకు మార్కెట్ అవసరాలకు అనుగుణమైన వరి రకాల సాగు, వేరుశెనగ పంట సాగు సాంకేతిక విధానాలు, ఆయిల్‌పామ్‌లో పోషక నిర్వహణ మరియు నీటి యాజమాన్యంపై విస్తృతంగా వివరించారు. రైతులు అధిక దిగుబడులు సాధించేందుకు శాస్త్రీయ పద్ధతులను అనుసరించాలని సూచించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆత్మ చైర్మన్ శ్రీ సుంకవెల్లి వీరభద్రరావు మాట్లాడుతూ గ్రామ స్థాయిలో శాస్త్రవేత్తలు రైతులతో మమేకమై వ్యవసాయ సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించడం అభినందనీయమన్నారు. వ్యవసాయ కళాశాల విద్యార్థులు గ్రామాల్లో ప్రత్యక్ష అనుభవం పొందడం ద్వారా భవిష్యత్తులో ఉత్తమ వ్యవసాయ నిపుణులుగా ఎదుగుతారని తెలిపారు. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన గ్రామ సర్పంచ్ శ్రీమతి సంగం వెంకటమ్మ మాట్లాడుతూ రైతులకు ఉపయోగకరమైన ఇటువంటి కార్యక్రమాలు గ్రామాల్లో మరింత నిర్వహించాలని కోరారు. గ్రామపంచాయతీ కార్యదర్శి శ్రీ శ్రీకాంత్, నారాయణపురం పశువైద్య అధికారి డా. వినయ్ కుమార్, మండల వ్యవసాయ అధికారి శ్రీ పి. శ్రీనివాసరావు, వ్యవసాయ విస్తరణ అధికారులు షకీరా భాను మరియు సతీష్ పాల్గొని రైతులకు పంటల సాగు, పశుసంవర్ధక నిర్వహణ మరియు ప్రభుత్వ వ్యవసాయ పథకాలపై వివరించారు. డా. కె. శిరీష సభను ఉద్దేశించి మాట్లాడుతూ కార్యక్రమంలో చురుకుగా పాల్గొన్న రైతులు, గ్రామస్థులకు కృతజ్ఞతలు తెలిపారు. రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు (ఆర్ ఎం ఎస్) ముగింపు కార్యక్రమం యొక్క ప్రాముఖ్యతను వివరించారు. కార్యక్రమం విజయవంతానికి సహకరించిన ప్రజాప్రతినిధులు, అధికారులు, రైతులు, విద్యార్థులు, ముద్రిత మరియు ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అనంతరం విస్తరణ శాస్త్రవేత్త రైతులతో ప్రత్యక్షంగా మమేకమై ఆధునిక వ్యవసాయ పద్ధతులు, పంటల నిర్వహణ, సమగ్ర వ్యవసాయ విధానాలు మరియు రైతు సమాజానికి ఉపయోగపడే విస్తరణ కార్యక్రమాలపై అవగాహన కల్పించారు. వ్యవసాయ కళాశాల, అశ్వారావుపేట ప్రథమ సంవత్సరం విద్యార్థులు కార్యక్రమంలో చురుకుగా పాల్గొని గ్రామీణ వ్యవసాయ పరిస్థితులను అవగాహన చేసుకున్నారు.