రైతు సమస్యల పరిష్కారానికి గ్రీవెన్స్‌లో వినతి పత్రం

పయనించే సూర్యుడు న్యూస్ జూన్ 16:( సింగరేణి రిపోర్టర్ నరేష్) కారేపల్లి, జూన్ 15: వ్యవసాయ సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో రైతులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను వెంటనే పరిష్కరించాలని తెలంగాణ రైతు సంఘం (ఏఐకేఎస్) సింగరేణి మండల కమిటీ ఆధ్వర్యంలో సోమవారం గ్రీవెన్స్ కార్యక్రమంలో అధికారులకు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా రైతు సంఘం మండల కార్యదర్శి వజ్జ రామారావు మాట్లాడుతూ రైతులకు ప్రత్తి, మిర్చి, వరి తదితర పంటలకు నాణ్యమైన విత్తనాలను సబ్సిడీ ధరలకు అందుబాటులో ఉంచాలని కోరారు. ప్రభుత్వం కొనుగోలు చేసిన మొక్కజొన్న, వరి ధాన్యాలకు సంబంధించిన బకాయి చెల్లింపులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పెండింగ్‌లో ఉన్న రైతు భరోసా నిధులను తక్షణమే చెల్లించి రైతులకు సాగు ఖర్చుల కోసం ఉపయోగపడేలా చూడాలని సూచించారు. ఖరీఫ్ సీజన్‌లో రైతు భరోసా సాయం అందించాలని, యూరియా కొరత లేకుండా చర్యలు చేపట్టాలని, యాప్‌ల పేరుతో రైతులను ఇబ్బందులకు గురిచేయవద్దని కోరారు. అలాగే పెరిగిన ఎరువుల ధరలను తగ్గించడంతో పాటు కుంటలు, చెరువుల కింద ఉన్న పంట కాలువలను మరమ్మతు చేసి సాగునీటి సౌకర్యాన్ని మెరుగుపరచాలని వినతి పత్రంలో పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం మండల అధ్యక్షులు ముండ్ల ఏకాంబరం, సీనియర్ నాయకులు తలారి దేవప్రకాష్, సీఐటీయూ మండల కన్వీనర్ కె. నరేంద్ర, వాసం భాస్కర్, మధురకోల సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.