వట్టెం పంప్‌హౌస్‌ను సందర్శించిన సీఎం రేవంత్ రెడ్డి –

ప్రాజెక్టు పురోగతిని పరిశీలించిన ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి

పయనించే సూర్యుడు జూన్ 6 నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లి రిపోర్టర్ శ్రావణ్ కుమార్ నాగర్‌కర్నూల్ జిల్లా కుమ్మెర గ్రామం వద్ద ఉన్న వట్టెం పంప్‌హౌస్ మూడో లిఫ్ట్‌ను రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుక్రవారం సందర్శించారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులను రెండు రోజులపాటు పరిశీలిస్తున్న ముఖ్యమంత్రితో కలిసి స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ కూచుకుళ్ల రాజేష్ రెడ్డి కూడా పాల్గొన్నారు. పాలమూరు–రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ (పీఆర్‌ఆర్‌ఎల్‌ఐఎస్)లో భాగంగా చేపట్టిన పనుల పురోగతిని ముఖ్యమంత్రి క్షేత్రస్థాయిలో పరిశీలించి, సంబంధిత అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా అధికారులు ప్రాజెక్టు ఖర్చులు, నిర్మాణ పనుల పురోగతిపై సీఎంకు వివరించారు. 2020 నుంచి 2023 వరకు రూ.3,300 కోట్లు ఖర్చు చేయగా, 2023 నుంచి ఇప్పటివరకు మరో రూ.800 కోట్లు వెచ్చించినట్లు తెలిపారు. మిగిలిన సివిల్ పనులను రూ.90 కోట్ల వ్యయంతో వచ్చే మూడు నెలల్లో పూర్తి చేయనున్నట్లు వెల్లడించారు. పంప్‌హౌస్‌లో మొత్తం 10 పంపులు ఉండగా, ఇప్పటికే 5 పంపులను అమర్చి విజయవంతంగా ట్రయల్ రన్ నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. వర్షాకాలంలో నీటి లభ్యత ఏర్పడగానే వెంకటాద్రి రిజర్వాయర్‌కు ఎత్తిపోతల ద్వారా నీటిని తరలించనున్నట్లు పేర్కొన్నారు. 16.74 టీఎంసీల సామర్థ్యం కలిగిన వెంకటాద్రి రిజర్వాయర్‌ను స్టాండర్డ్ ఆపరేటింగ్ సిస్టమ్ ప్రకారం విడతల వారీగా నింపనున్నట్లు అధికారులు వివరించారు. పాలమూరు–రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ద్వారా మొత్తం 12.30 లక్షల ఎకరాలకు సాగునీరు అందించడమే లక్ష్యమని తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, ప్రాజెక్టు పూర్తయితే మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, రంగారెడ్డి, నల్గొండ జిల్లాల్లో సాగునీటి అవసరాలతో పాటు తాగునీరు, పరిశ్రమల నీటి అవసరాలు కూడా తీరనున్నాయని అన్నారు.