వరి సాగులో సరికొత్త విప్లవం

★ తడి-పొడి పద్ధతితో పర్యావరణ పరిరక్షణ, బోనస్ ఆదాయం! ★ ​పర్యావరణాన్ని కాపాడితే నేరుగా రైతు ఖాతాల్లోకే కార్బన్ క్రెడిట్స్ నగదు బదిలీ ★ ​అశ్వారావుపేట రైతు వేదికలో దేశ రాజధాని వ్యవసాయ శాస్త్రవేత్తల ప్రత్యక్ష అవగాహన సదస్సు

పయనించేసూర్యుడు న్యూస్ జూన్ 9 అశ్వారావుపేట మండల రిపోర్టర్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ​అశ్వారావుపేట సాంప్రదాయ వరి సాగులో పెట్టుబడులు నానాటికీ పెరిగిపోతూ సాగునీటి లభ్యత తగ్గిపోతున్న ప్రస్తుత తరుణంలో అశ్వారావుపేట మండల వరి రైతులకు సరికొత్త సాంకేతిక పరిజ్ఞానంపై మార్గదర్శకత్వం లభించింది. చేంజ్ అలయన్స్, డి బి ఆర్ సి, మరియు వరాహ సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో స్థానిక రైతు వేదికలో ఒక భారీ అవగాహన సదస్సును అత్యంత విజయవంతంగా నిర్వహించారు. దేశ రాజధాని ఢిల్లీ నుండి విచ్చేసిన ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్తలు ఈ సదస్సులో పాల్గొని రైతులకు ప్రత్యక్షంగా దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన అశ్వారావుపేట నియోజకవర్గ ఆత్మ కమిటీ చైర్మన్ వీరభద్రరావు రైతులు పర్యావరణాన్ని కాపాడుతూ లాభసాటి వ్యవసాయంతో అభివృద్ధి చెందాలని కోరారు. వరి సాగులో ఏ డబ్ల్యు డి విప్లవం ప్రస్తుత రోజుల్లో నీటి కొరత, విపరీతమైన విద్యుత్ ఛార్జీల భారం రైతులకు పెద్ద సవాలుగా మారాయి. వీటికి దీటైన పరిష్కారంగా గ్రీన్ ప్యాడీ ప్రాజెక్ట్ లో భాగంగా ప్రవేశపెట్టిన తడి-పొడి సాగు పద్ధతి వరి సాగులో సరికొత్త మార్పుకు నాంది పలకనుందని శాస్త్రవేత్తలు స్పష్టం చేశారు. ఈ పద్ధతిని అవలంబించడం ద్వారా వరి దిగుబడి ఏమాత్రం తగ్గకుండానే, అద్భుతమైన ప్రయోజనాలు పొందవచ్చని నిర్వాహకులు తెలిపారు. ​ఈ పద్ధతి వలన ​30 శాతం నీటి పొదుపు సాంప్రదాయ పద్ధతితో పోలిస్తే ఈ నూతన తడి-పొడి సాగు విధానంలో వరి సాగుకు అవసరమయ్యే నీటి వినియోగం దాదాపు 30 శాతం వరకు తగ్గుతుంది.​ సాగు నీటి వినియోగం తగ్గడం వల్ల మోటార్ల వాడకం గణనీయంగా తగ్గుతుంది. దీనివల్ల కరెంట్ బిల్లులు ఆదా అవ్వడమే కాకుండా, మోటార్ల అరుగుదల ఖర్చులు తగ్గి పెట్టుబడి భారం తగ్గుతుంది. ​స్థిరమైన నాణ్యమైన దిగుబడి: శాస్త్రీయ పద్ధతుల ద్వారా తక్కువ నీటితోనే నాణ్యమైన, స్థిరమైన అత్యధిక వరి దిగుబడిని సాధించవచ్చని శాస్త్రవేత్తలు నిరూపించారు. ​రైతులకు లభించనున్న కార్బన్ క్రెడిట్స్ బోనస్! ఈ ప్రాజెక్టులోని అత్యంత ఆకర్షణీయమైన అంశమన్నారు. పర్యావరణ పరిరక్షణతో కూడిన అదనపు ఆదాయం. తడి-పొడి సాగు పద్ధతి ద్వారా భూమి నుండి వాతావరణంలోకి విడుదలయ్యే ప్రమాదకర మిథేన్ ఉద్గారాలను 48 శాతం వరకు తగ్గించవచ్చు. ఇలా పర్యావరణాన్ని కాపాడుతూ వరి పండించే రైతులకు 'కార్బన్ క్రెడిట్స్' రూపంలో ప్రభుత్వం మరియు అంతర్జాతీయ సంస్థల నుండి నేరుగా వారి బ్యాంక్ ఖాతాల్లోకే అదనపు నగదు ప్రోత్సాహకం (బోనస్ ఆదాయం) అందుతుందని శాస్త్రవేత్తలు వెల్లడించారు.​అశ్వారావుపేట మండలంలోని వరి రైతులందరూ, ముఖ్యంగా ఆధునిక వ్యవసాయం వైపు అడుగులు వేస్తూ తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు సాధించాలనుకునే ప్రతీ ఒక్క రైతు సోదరుడూ ఈ సువర్ణ అవకాశాన్ని వినియోగించుకోవాలని నిర్వాహక సంస్థలైన చేంజ్ అలయన్స్, డి.వి.ఆర్.సి మరియు వరాహ ప్రతినిధులు ఢిల్లీ వ్యవసాయ శాస్త్రవేత్త బాసబ్, ప్రతినిధులు అల్లాడి దేవకుమార్, హేమ, ఉమామహేశ్వరరావు, బాబ్జి, అఖిల్ మల్హోత్రా, ఆశిష్ లు పిలుపునిచ్చారు. రైతులు ఆధునిక సాంకేతికతను తెలుసుకొని, లాభాల బాట పట్టాలని కోరారు. ఈ బృహత్తర కార్యక్రమంలో అశ్వారావుపేట నియోజకవర్గ ఆత్మ కమిటీ చైర్మన్ సుంకవల్లి వీరభద్రరావు, ప్రముఖ నాయకులు చిన్నంశెట్టి సత్యనారాయణ, శీమకుర్తి వెంకటేశ్వరరావు, కరుటూరి వెంకటేశ్వరరావు, నరసింహారావు, సుమన్ పాల్గొన్నారు. అలాగే మండలంలోని వివిధ గ్రామాల నుండి వరి రైతులు, వ్యవసాయ కళాశాల ప్రొఫెసర్ నాగాంజలి, అశ్వారావుపేట మండల అగ్రికల్చర్ ఆఫీసర్ శ్రీనివాసరావు, ఏఈఓ సతీష్, కృషి విజ్ఞాన కేంద్రం కోఆర్డినేటర్ భరత్ కుమార్, ఉద్యాన శాఖ అధికారి శివ పాల్గొన్నారు. డి బి ఆర్ సి అశ్వారావుపేట, దమ్మపేట ఫీల్డ్ కోఆర్డినేటర్లు హనుమంతరావు, ఉదయరాఘవేంద్ర, గుళ్ళా రాంబాబు, వాడపల్లి రవిబాబు మరియు వందలాది మంది రైతులు ఈ కార్యక్రమంలో పాల్గొని, శాస్త్రవేత్తలను అడిగి తమ సందేహాలను నివృత్తి చేసుకున్నారు.