పయనించే సూర్యుడు, కోరుట్ల జూలై 3. పీఎం శ్రీ జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల, కొరుట్ల విద్యార్థులు వికసిత్ భారత్ బిల్డథాన్-2025 పోటీలలో వినూత్న ఆవిష్కరణతో ప్రతిభ కనబరిచి బహుమతి సాధించారు. "వోకల్ ఫర్ లోకల్" అనే అంశంపై విద్యార్థులు రూపొందించిన "ఫోల్డబుల్ ఎలక్ట్రిక్ సైకిల్" (ఫోల్డబుల్ ఎలక్ట్రిక్ సైకిల్ ) నమూనా పర్యావరణహితంగా, కాలుష్య రహితంగా, స్థానికంగా తయారు చేయగలిగే సాంకేతిక ఆవిష్కరణగా విశేష ప్రశంసలు అందుకుంది. ఈ నమూనా తక్కువ స్థలంలో మడతపెట్టి తీసుకెళ్లే సౌకర్యంతో పాటు విద్యుత్‌తో పనిచేయడం వల్ల ఇంధన వినియోగాన్ని తగ్గించి పర్యావరణ పరిరక్షణకు దోహదపడుతుందని విద్యార్థులు వివరించారు. ఈ ప్రాజెక్టును పాఠశాల సైన్స్ ఉపాధ్యాయులు చందా నాగరాజు వారి మార్గదర్శకత్వం, పర్యవేక్షణలో రూపొందించారు. ఈ ప్రాజెక్టులో విజేతలుగా నిలిచిన విద్యార్థులు ఎస్. హిమాని,కె. హారిక,డి. మధులిక, జి. రేవతి,జి. ప్రణీత్ వి జేతలుగా నిలిచినారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు వడ్లకొండ గంగాధర్ మాట్లాడుతూ, విద్యార్థులు సాధించిన ఈ విజయం పాఠశాలకు గర్వకారణమని అన్నారు. స్థానిక ఉత్పత్తులను ప్రోత్సహించడం, పర్యావరణ పరిరక్షణ, కాలుష్య రహిత రవాణా వ్యవస్థలను అభివృద్ధి చేయడం వంటి లక్ష్యాలకు అనుగుణంగా విద్యార్థులు రూపొందించిన ఈ ప్రాజెక్టు అభినందనీయమని పేర్కొన్నారు. విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథం, సృజనాత్మకత, ఆవిష్కరణ సామర్థ్యాలను పెంపొందించేందుకు పాఠశాల ఎల్లప్పుడూ ప్రోత్సాహం అందిస్తోందని తెలిపారు. ఈ విజయానికి కృషి చేసిన సైన్స్ ఉపాధ్యాయులు చందా నాగరాజు, విజేత విద్యార్థులు, సహకరించిన ఉపాధ్యాయులు మరియు తల్లిదండ్రులను ప్రధానోపాధ్యాయులు అభినందిస్తూ, భవిష్యత్తులో మరిన్ని రాష్ట్ర, జాతీయ స్థాయి విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.