పయనించే సూర్యుడు, కోరుట్ల జులై 7. కోరుట్ల పట్టణానికి చెందిన పీఎం శ్రీ జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల (జడ్పీజీ హెచ్ స్ ) విద్యార్థినులు సరికొత్త ఆవిష్కరణతో సంచలనం సృష్టించారు. వారు రూపొందించిన "ఫోల్డబుల్ ఎలక్ట్రిక్ సైకిల్" ప్రాజెక్ట్ జాతీయ స్థాయి 'వికసిత్ భారత్ బిల్డ్‌థాన్' పోటీలకు ఎంపికైంది. ఈ నేపథ్యంలో పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ శ్రీ నవీన్ నికోలస్, ఐఏఎస్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు వడ్లకొండ గంగాధర్ మరియు సైన్స్ టీచర్ చందా నాగరాజు, విద్యార్థులను ప్రశంసిస్తూ అధికారిక ప్రశంసా పత్రాన్ని అందజేశారు. కేంద్ర ప్రభుత్వం పిలుపునిచ్చిన "వోకల్ ఫర్ లోకల్" థీమ్ ఆధారంగా ఈ ప్రాజెక్ట్‌ను రూపొందించారు. నిత్య జీవితంలో ప్రయాణ ఇబ్బందులను దూరం చేస్తూ, పర్యావరణహితంగా, తక్కువ ఖర్చుతో మరియు సులభంగా మడతపెట్టుకునేలా (ఫోల్డబుల్ ) ఈ ఎలక్ట్రిక్ సైకిల్‌ను తయారు చేయడం విశేషం. విద్యార్థినుల సాంకేతిక నైపుణ్యాలను, హరిత ఇంధన రంగంపై వారికున్న అవగాహనను డైరెక్టర్ నవీన్ నికోలస్ ప్రత్యేకంగా కొనియాడారు. గ్రామీణ ప్రాంత విద్యార్థినులు సాధించిన ఈ అద్భుత విజయానికి గానూ పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు మరియు స్థానిక ప్రజలు విద్యార్థినులపై అభినందనల జల్లు కురిపిస్తున్నారు.