పయనించే సూర్యుడు మే 21, కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ (బి వి బి) కర్ణాటక కోలార్‌లోని శ్రీ దేవరాజ్ యు ఆర్ ఎస్ మెడికల్ కాలేజ్ లో నిర్వహించిన కాన్వొకేషన్ కార్యక్రమంలో డా. మన్నే సాయి తేజ ఎమ్‌డీ పీడియాట్రిక్స్ పూర్తి చేసి “మెరిటోరియస్ ప్రొఫిషియెన్సీ సర్టిఫికేట్” అందుకున్నారు. ఈ సందర్భంగా ప్రముఖ లీగల్ కన్సల్టెంట్ పులగం రామకృష్ణారెడ్డి డా. సాయి తేజ గారిని, ఆయన తండ్రి ప్రసాద్ సార్ ని అభినందించారు. రాజమండ్రి సత్యసాయి గురుకులంలో వార్డెన్‌గా పనిచేసిన ప్రసాద్ సార్ అనేక మంది విద్యార్థులకు క్రమశిక్షణ, విలువలు, విద్యపై ఆసక్తి పెంపొందించే విధంగా మార్గనిర్దేశం చేసిన వ్యక్తిగా గుర్తింపు పొందారు. విద్యార్థులకు పాఠాలు అర్థమయ్యేలా వివరించడం, సందేహాలను ఓర్పుతో నివృత్తి చేయడం, వారిని సన్మార్గంలో నడిపించడం ఆయన ప్రత్యేకతగా నిలిచిందని రామకృష్ణారెడ్డి తెలిపారు. గురుకుల సేవల అనంతరం వ్యాపార రంగంలోకి వెళ్లినప్పటికీ ప్రసాద్ సార్‌లోని మంచితనం, సేవాభావం మారలేదన్నారు. ప్రస్తుతం ఆయన కుమారుడు డా. సాయి తేజ ఎమ్‌డీ పీడియాట్రిక్స్ పూర్తి చేసి ప్రతిభా పురస్కారం అందుకోవడం కుటుంబానికి మాత్రమే కాకుండా గురుకులంలో చదువుకున్న పూర్వ విద్యార్థులందరికీ గర్వకారణమని పేర్కొన్నారు. డా. సాయి తేజ భవిష్యత్తులో చిన్నారుల ఆరోగ్య సేవలో మరింత ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆయన ఆకాంక్షించారు.