​ వేధింపులపై భయపడొద్దు.ధైర్యంగా ఫిర్యాదు చేయండి.

జనగామ షీ టీమ్ ఎస్‌ఐ లలిత

పయనించే సూర్యుడు, జులై 8, బచ్చన్నపేట మండల ప్రతినిధి: నీల పవన్. మహిళలు, బాలికల రక్షణే ధ్యేయంగా షీ టీమ్స్ పనిచేస్తున్నాయని వేధింపులు ఎదురైనప్పుడు భయపడకుండా ధైర్యంగా ముందుకు వచ్చి పోలీసులను ఆశ్రయించాలని జనగామ జిల్లా షీ టీమ్ ఎస్‌ఐ లలిత పిలుపునిచ్చారు. మంగళవారం బచ్చన్నపేట మండలంలోని పలు విద్యాసంస్థల్లో విద్యార్థినులకు షీ టీమ్స్ పనితీరు, రక్షణ చర్యలపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ​​జనగామ జిల్లా షీ టీమ్ ఎస్‌ఐ లలిత ఆధ్వర్యంలో బచ్చన్నపేట మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం (KGBV), జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల (ZPHS), మరియు తుమ్మబాల పాఠశాలల్లో విద్యార్థినుల కోసం ప్రత్యేక అవగాహన సదస్సులు ఏర్పాటు చేశారు.​ఈ సందర్భంగా ఎస్‌ఐ లలిత విద్యార్థినులను ఉద్దేశించి మాట్లాడుతూ సమాజంలో మహిళలు, బాలికల భద్రత కోసం ప్రభుత్వం అందిస్తున్న వివిధ రకాల సేవలపై వివరంగా అవగాహన కల్పించారు. వేధింపులు ఎదురైనప్పుడు షీ టీమ్‌ను ఎలా సంప్రదించాలి, ఎలాంటి పరిస్థితుల్లో తక్షణమే పోలీసుల సహాయం తీసుకోవాలనే విషయాలను వివరించారు. బాలికల రక్షణ కోసం అందుబాటులో ఉన్న టోల్ ఫ్రీ నంబర్లు, పోలీస్ సేవల గురించి అవగాహన కల్పించారు. అపరిచిత వ్యక్తుల నుండి లేదా సామాజిక మాధ్యమాల్లో వేధింపులు ఎదురైతే లోలోపల మదనపడకుండా తక్షణమే షీ టీమ్‌కు సమాచారం అందించి చట్టపరమైన రక్షణ పొందాలని సూచించారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలను పూర్తిగా గోప్యంగా ఉంచుతామని ఆమె భరోసా ఇచ్చారు. ​ఈ అవగాహన కార్యక్రమాల్లో షీ టీమ్ సిబ్బందితో పాటు బచ్చన్నపేట పోలీస్ స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ సిరాజుద్దీన్, కానిస్టేబుళ్లు తిరుపతి రెడ్డి, నవీన్ రెడ్డి, ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయ బృందం మరియు పెద్ద సంఖ్యలో విద్యార్థినులు పాల్గొన్నారు.