షాద్‌నగర్ సమ్మర్ చెస్ ఛాంపియన్–3 ఫెస్టివల్ ఘన ప్రారంభం

★ మేధో వికాసానికి చదరంగం ఉత్తమ సాధనం.మున్సిపల్ ఛైర్మన్ అగ్గనూర్ బస్వం ★ క్రీడా ప్రోత్సాహానికి తన సహకారం ఎల్లవేళలా ఉంటుంది. ★ మున్సిపల్ వైస్ ఛైర్మన్ అందే మోహన్ ★ చదరంగం సృజనాత్మక ఆలోచన వైపు మళ్ళిస్తుంది. బండారి రమేష్

పయనించే సూర్యుడు జూన్ 03 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్) షాద్‌నగర్ పట్టణ కేంద్రంలోని పతంజలి యోగ కేంద్రంలో టోర్నమెంట్ డైరెక్టర్ వానరాశి జగన్, చీఫ్ ఆర్బిటర్ బార్లా మణికంఠ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న “షాద్‌నగర్ సమ్మర్ చెస్ ఛాంపియన్–3 ఫెస్టివల్” సోమవారం అట్టహాసంగా ప్రారంభమైంది. చిన్నారులు, విద్యార్థుల్లో మేధస్సు, ఏకాగ్రత, వ్యూహాత్మక ఆలోచనలను పెంపొందించే లక్ష్యంతో ఈ పోటీలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా షాద్‌నగర్ మున్సిపల్ ఛైర్మన్ అగ్గనూర్ బస్వం, 25వ వార్డు కౌన్సిలర్ సి. పెంటయ్య, బండారి రమేష్, 27వ వార్డు కౌన్సిలర్ హప్పి, ఎలికట్ట ఉపసర్పంచ్ అభినవ్ హాజరయ్యారు. వారు జ్యోతి ప్రజ్వలన చేసి అనంతరం చెస్ బోర్డుపై తొలి ఎత్తు వేసి పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా మున్సిపల్ ఛైర్మన్ అగ్గనూర్ బస్వం మాట్లాడుతూ…చదరంగం కేవలం ఆట మాత్రమే కాదని, ఆలోచనా శక్తిని పెంపొందించే మేధో క్రీడ అని పేర్కొన్నారు. నేటి పోటీ ప్రపంచంలో విద్యతో పాటు మానసిక వికాసం కూడా ఎంతో అవసరమని, అందుకు చెస్ వంటి ఆటలు విద్యార్థులకు ఎంతో ఉపయోగపడతాయని అన్నారు. ఓర్పు, ప్రణాళికా నైపుణ్యం, సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకునే సామర్థ్యాలను పెంపొందించడంలో చదరంగం కీలక పాత్ర పోషిస్తుందని వివరించారు. నిర్వాహకులు మాట్లాడుతూ…వేసవి సెలవులను సద్వినియోగం చేసుకునేలా చిన్నారుల్లో చెస్ పట్ల ఆసక్తి పెంపొందించేందుకు ఈ ఫెస్టివల్‌ను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ పోటీల్లో అండర్–7 నుంచి అండర్–17 విభాగాల వరకు సుమారు 70 మంది బాలబాలికలు పాల్గొని తమ ప్రతిభను చాటుతున్నారని పేర్కొన్నారు.పోటీల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన క్రీడాకారులకు మున్సిపల్ వైస్ ఛైర్మన్ అందే మోహన్ చేతుల మీదుగా విజేతలైన 12 మంది విద్యార్థులకు ప్రశంసా పత్రాలు, బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా అందే మోహన్ మాట్లాడుతూ… క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతగానో ఉపయోగపడతాయని అన్నారు. క్రీడారంగ అభివృద్ధికి తన సహాయ సహకారాలు ఎల్లవేళలా అందిస్తానని, ముఖ్యంగా ప్రతిభ కలిగిన పేద విద్యార్థులకు ఆర్థికంగా అండగా నిలవడానికి సిద్ధంగా ఉన్నానని తెలిపారు. భవిష్యత్తులో ఈ ప్రాంతానికి చెందిన క్రీడాకారులు రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాణించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, క్రీడాభిమానులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొని పోటీలను వీక్షించి చిన్నారులను ప్రోత్సహించారు.చదరంగం పట్ల విద్యార్థుల్లో ఆసక్తి పెంపొందించేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. హిందూ పరిషత్ రాష్ట్ర కార్యదర్శి బండారి రమేష్ మాట్లాడుతూ…చదరంగం అనేది రాజుల ఆటగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన క్రీడ అని, ప్రతి ఎత్తు జీవితంలో తీసుకునే నిర్ణయాలకు ప్రతిబింబంగా ఉంటుందని హిందూ పరిషత్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పేర్కొన్నారు. చెస్ బోర్డుపై విజయం సాధించాలంటే ఆలోచన, విశ్లేషణ, సహనం అవసరమైనట్లే జీవితంలో కూడా ప్రతి అడుగు ఆచితూచి వేయాల్సిన అవసరం ఉందన్నారు.నేటి యువత మొబైల్ ఫోన్లు, సామాజిక మాధ్యమాలకు ఎక్కువ సమయం కేటాయిస్తున్న తరుణంలో చెస్ వంటి మేధో క్రీడలు వారిని సృజనాత్మక ఆలోచనల వైపు మళ్లిస్తాయని చెప్పారు. ఓటమిని పాఠంగా, విజయాన్ని బాధ్యతగా స్వీకరించడం చెస్ నేర్పే గొప్ప గుణమని అన్నారు.గ్రామీణ ప్రాంతాల్లో కూడా చెస్‌కు ఆదరణ పెరగడం శుభపరిణామమని, భవిష్యత్తులో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించే క్రీడాకారులు ఇలాంటి టోర్నమెంట్ల నుంచే తయారవుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. క్రీడాకారులు గెలుపు–ఓటములను సమానంగా స్వీకరించి క్రీడా స్ఫూర్తిని చాటాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో ఉప్పరి గడ్డ చందు నాయక్, సంస్కృతిక కళాకారులు& మ్యూజిక్ మాస్టర్స్ ప్రేమ్ కుమార్, కే సురేందర్, తల్లిదండ్రులు స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.