సన్నరకం వరి విత్తనాలు సమృద్ధిగా అందుబాటులో ఉంచాలి: డీఏఓ స్వరూపారాణి

"విత్తనాల దుకాణంలో ఆకస్మికంగా తనిఖీ చేసిన డిఏఓ స్వరూప రాణి ఏవో సాయికిరణ్ "

పయనించే సూర్యుడు జూన్ 12 రాజేష్ దౌల్తాబాద్) దౌల్తాబాద్, జూన్ 11: రైతులకు అవసరమైన సన్నరకం వరి విత్తనాలు సమృద్ధిగా అందుబాటులో ఉండేలా విత్తనాల డీలర్లు చర్యలు తీసుకోవాలని సిద్దిపేట జిల్లా వ్యవసాయ అధికారి (డీఏఓ) స్వరూపారాణి సూచించారు. గురువారం దౌల్తాబాద్ మండల కేంద్రంలోని పలు విత్తనాల దుకాణాలను ఆమె ఆకస్మికంగా తనిఖీ చేసి విత్తనాల నిల్వలు, విక్రయాల పరిస్థితిని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం సన్నరకం వరి సాగును ప్రోత్సహిస్తున్న నేపథ్యంలో డీలర్లు అధిక మొత్తంలో సన్నరకం వరి విత్తనాలను అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. ఆసక్తి గల డీలర్లకు తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ ద్వారా కూడా నాణ్యమైన విత్తనాలను సరఫరా చేసే ఏర్పాట్లు ఉన్నాయని తెలిపారు. సన్నరకం వరి సాగు చేసే రైతులకు ప్రభుత్వం క్వింటాల్‌కు రూ.500 బోనస్ అందిస్తున్నందున రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అలాగే యూరియాను ప్రభుత్వం నిర్దేశించిన యాప్ ద్వారా మాత్రమే రైతులకు విక్రయించాలని, కాంప్లెక్స్ ఎరువులను నిర్ణీత ధరలకే విక్రయించాలని హెచ్చరించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ అధిక ధరలకు ఎరువులు విక్రయించరాదని స్పష్టం చేశారు. వ్యవసాయ శాఖ రైతులకు అవసరమైన విత్తనాలు, ఎరువులు సకాలంలో అందేలా నిరంతరం పర్యవేక్షణ కొనసాగిస్తోందని డీఏఓ తెలిపారు. ఈ తనిఖీలలో వ్యవసాయ విస్తరణ అధికారి (ఏవో) సాయి కిరణ్ తదితరులు పాల్గొన్నారు.