సామినేని రామారావు హంతకులను వెంటనే అరెస్టు చేయాలి : మడిపల్లి గోపాలరావు

పయనించే సూర్యుడు మే 28, (చింతకాని మండలం రిపోర్టర్). చింతకాని మండల పరిధిలోని పాతర్లపాడు గ్రామానికి చెందిన సిపిఎం రాష్ట్ర నాయకులు, మాజీ సర్పంచ్ సామినేని రామారావు హత్య కేసులో నిందితులను వెంటనే అరెస్టు చేయాలని సిపిఎం మధిర డివిజన్ కార్యదర్శి మడిపల్లి గోపాలరావు డిమాండ్ చేశారు. బుధవారం స్థానిక వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట అమరవీరుల భవనంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సామినేని రామారావు హత్య జరిగి ఏడు నెలలు గడిచినా ఇప్పటివరకు నిందితులను అరెస్టు చేయకపోవడం వెనుక రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయని ఆయన ఆరోపించారు. ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డిని తాము కలిసి హంతకులను అరెస్టు చేయాలని మాత్రమే కోరామని, కాంగ్రెస్ నాయకులను అరెస్టు చేయాలని ఎక్కడా చెప్పలేదన్నారు. అలాంటప్పుడు కాంగ్రెస్ నాయకులు ఖమ్మం సీపీని కలిసి వినతిపత్రం ఇవ్వడంలో ఉద్దేశం ఏమిటో ప్రజలకు చెప్పాలని ప్రశ్నించారు. దేశంలో ఎన్నో క్లిష్టమైన హత్య కేసులను పోలీసులు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో 24 గంటల్లో చేధిస్తున్నప్పటికీ, సామినేని రామారావు హత్య కేసులో మాత్రం ఏడు నెలలుగా పురోగతి లేకపోవడం అనుమానాలకు తావిస్తోందన్నారు. ఈ కేసులో పోలీసులు, కాంగ్రెస్ నాయకులు కుమ్మక్కయ్యారని ఆరోపించారు. సామినేని రామారావు కుటుంబంపై కొందరు ఆరోపణలు చేయడం సరికాదని, అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉండగా నిష్పక్షపాత దర్యాప్తు చేసి వాస్తవాలను బయటపెట్టాలని డిమాండ్ చేశారు. కర్ణాటకలో పాలిగ్రాఫ్ టెస్ట్ చేయించుకోవడం ద్వారా ఎవ్వరూ నిర్దోషులుగా నిరూపించుకోలేరని, దేశంలో పాలిగ్రాఫ్ టెస్ట్ ఆధారంగా నిందితులను పట్టుకున్న చరిత్ర లేదన్నారు. ముఖ్యమంత్రి సిట్ ఏర్పాటు చేస్తే నిజాలు బయటపడతాయని, అందుకే కాంగ్రెస్ నాయకులు భయపడుతున్నారని ఆయన ఆరోపించారు. నియోజకవర్గంలో శవ రాజకీయాలు చేసేది కాంగ్రెస్ పార్టీయేనని విమర్శించారు. గతంలో పందిళ్లపల్లి, పాతర్లపాడు, గోవిందాపురం ప్రాంతాల్లో సిపిఎం నాయకుల హత్యలకు కాంగ్రెస్ కారణం కాదా అని ప్రశ్నించారు. ఈ విలేకరుల సమావేశంలో చింతలచెరువు కోటేశ్వరరావు, దొండపాటి నాగేశ్వరరావు, కిలారు సురేష్, బంధం శ్రీనివాసరావు, తెల్లాకుల శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.