పయనించే సూర్యుడు న్యూస్ జూన్ 14:( సింగరేణి రిపోర్టర్ నరేష్) భక్తిశ్రద్ధలతో మొక్కులు చెల్లించుకున్న గ్రామస్తులు… ఖమ్మం జిల్లా సామ్య తండా గ్రామంలో శ్రీ నాబీశీల బొడ్రాయి ముత్యాలమ్మ తల్లి వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని బోనాల పండుగను అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకలను శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానం ఆలయ చైర్మన్ ధరావత్ కళ్యాణ్ ఆధ్వర్యంలో ఘనంగా చేపట్టారు.ఉదయం నుంచే గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. సంప్రదాయ వస్త్రధారణలో మహిళలు బోనాలు ఎత్తుకొని అమ్మవారి ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. డప్పు చప్పుళ్లు, భక్తి గీతాల నడుమ మహిళలు అమ్మవారికి నైవేద్యాలు సమర్పించి తమ కుటుంబాల శ్రేయస్సు కోసం మొక్కులు చెల్లించుకున్నారు. అలాగే గ్రామ పెద్దలు, భక్తులు ముత్యాలమ్మ తల్లి మరియు పోతురాజులకు మేకపోతులను బలిచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామస్థులు అమ్మవారి కటాక్షంతో సమృద్ధిగా వర్షాలు కురిసి, పంటలు బాగా పండాలని, రైతులు సుభిక్షంగా ఉండాలని ప్రార్థించారు.పంటల సాగు ప్రారంభమయ్యే ఈ కీలక సమయంలో నిర్వహించే బోనాల పండుగ గ్రామీణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తుందని గ్రామ పెద్దలు పేర్కొన్నారు. గ్రామ ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో సుఖసంతోషాలతో జీవించాలని, గ్రామంపై అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బానోత్ హిరాలాల్, ఉపసర్పంచ్ గుగులోత్ భీక్కులాల్, వార్డు మెంబర్లు, గ్రామ పెద్దలు గూగులోత్ భీముడు నాయక్ , బానోతు రాందాస్,రామచందర్ ,లావుడియా ఈర్యా నాయక్ ,రాజేష్ ,నాగేష్ ,యువకులు, మహిళలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని పండుగను విజయవంతం చేశారు. భక్తి, సంప్రదాయం, సామూహిక ఐక్యతకు ప్రతీకగా నిలిచిన ఈ బోనాల సంబరాలు సామ్య తండా గ్రామంలో ఆధ్యాత్మిక ఉత్సాహాన్ని నింపాయి.