03 Nov 2026 | 01:17 AM

సింగరేణిలోని ఐదు గనులకు జాతీయస్థాయిలో ఫైవ్ స్టార్ రేటింగ్ అవార్డులు

పయనించే సూర్యుడు న్యూస్, పెద్దపల్లి, రామగిరి( ప్రత్యేక ప్రతినిధి)-03 ఉత్తమ మైనింగ్ పద్ధతుల అమలు, పర్యావరణ హిత చర్యలు, కార్మికుల సంక్షేమం, సౌకర్యాల కల్పనలో ఉత్తమ కంపెనీగా ఉన్న సింగరేణి సంస్థ.. 2024-25 ఆర్థిక సంవత్సరానికి జాతీయస్థాయిలో 5 బొగ్గు గనులకు ఫైవ్ స్టార్ రేటింగ్‌ను సాధించి తన ప్రతిభను మరోసారి చాటుకుంది.సోమవారం ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం రాయ్‌పూర్‌లో జరిగిన అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో కేంద్ర బొగ్గు, గనుల శాఖ సహాయ మంత్రి సతీష్ చంద్ర దూబే చేతుల మీదుగా.. సింగరేణి సంస్థ ఛైర్మన్ మరియు ఎండీ బుద్ధప్రకాష్ జ్యోతి ఈ అవార్డులను అందుకున్నారు.ప్రతిష్టాత్మక ఫైవ్ స్టార్ రేటింగ్ అవార్డులను అందుకున్న గనులలో.. శ్రీరాంపూర్ ఏరియాలోని ఆర్‌కేఎన్‌టీ, ఆర్‌కే-6 ఇంక్లైన్, సత్తుపల్లి ఏరియాకు చెందిన జేవీఆర్ ఓసీ-2, బెల్లంపల్లి ఏరియాకు చెందిన ఖైరీగూఢ ఓసీ, రామగుండం-3కి చెందిన ఆర్‌జీఓసీ-1 గనులు ఉన్నాయి.కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ ప్రతీ ఏడాది దేశంలో అత్యుత్తమ గనులకు స్టార్ రేటింగ్‌ను ఇస్తుంది. అత్యుత్తమ స్టార్ రేటింగ్ సాధించిన గనుల యాజమాన్యాలను అభినందిస్తూ అవార్డులనుఅందిస్తూ ఉంటారు.ఇలా స్టార్ రేటింగ్ ఇవ్వడం కోసం బొగ్గు గని పనితీరు, రక్షణ చర్యలు, నిర్వహణ, సౌకర్యాలు, పర్యావరణహిత చర్యలు, కార్మిక సంక్షేమం వంటి 84 అంశాలను పరిగణనలోకి తీసుకుని మార్కులను కేటాయిస్తారు. జాతీయ స్థాయిలో ఉత్తమ ప్రమాణాలు నెలకొల్పి ఉన్న గనులలో పై 84 అంశాలను కేంద్ర బొగ్గు శాఖ నుంచి వచ్చిన పరీశీలక బృందం ప్రత్యక్షంగా పరిశీలించి మూల్యాంకనం జరుపుతుంది.ప్రాథమిక మూల్యాంకనం తర్వాత వీటి నుంచి అత్యుత్తమ గనులను ఎంపిక చేస్తారు. ఇలా ఎంపిక చేసిన వాటిలో ఇంకా అత్యుత్తమమైన వాటిని మరో కమిటీ ద్వారా ఎంపిక చేయడం జరుగుతుంది. మొత్తం 100 మార్కుల్లో 91 కన్నా ఎక్కువ మార్కులు సాధించిన గనులకు ఫైవ్ స్టార్ రేటింగ్ ఇస్తారు. ఈ విధంగా సింగరేణి సంస్థలో ఈసారి ఐదు గనులు ఫైవ్ స్టార్ రేటింగ్ సాధించడం అభినందనీయం. ఈ గనుల నిర్వహణ, పర్యావరణ చర్యలు, సంక్షేమ కార్యక్రమాలు, ఉత్పత్తి సాంకేతికత వంటి అంశాలలో ఉత్తమ ప్రమాణాలు పాటిస్తున్నందు వల్లే ఈ అవార్డులు సాధించుకోవడం జరిగింది. దీనిపై సీఎండీ బుద్ధప్రకాష్ జ్యోతి హర్షం వ్యక్తం చేశారు. గనుల యాజమాన్యాలకు, కార్మికులకు తన అభినందనలు తెలిపారు.సింగరేణిలో ఐదు గనులు ఫైవ్ స్టార్ రేటింగ్ సాధించడంపై సింగరేణి అధికారులు, ఉద్యోగులు, సిబ్బందిని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అభినందించారు. ఇదే స్ఫూర్తితో రానున్న రోజుల్లో మరిన్ని గనులు ఫైవ్ స్టార్ రేటింగ్ సాధించి రాష్ట్ర ప్రతిష్టను పెంచాలన్నారు. ఈ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో బొగ్గు మంత్రిత్వ శాఖ అడిషనల్ సెక్రటరీ సనోజ్ కుమార్ ఝా, కోల్ కంప్ట్రోలర్ సతీష్ కుమార్, కోల్ ఇండియా సీఎండీ సాయిరాం, సింగరేణి సంస్థ డైరెక్టర్ (ప్లానింగ్ అండ్ ప్రాజెక్ట్స్) కే. వెంకటేశ్వర్లు, జనరల్ మేనేజర్ (కోఆర్డినేషన్ అండ్ మార్కెటింగ్) టి.శ్రీనివాస్, రామగుండం-3 ఏరియా జనరల్ మేనేజర్ ఎస్.మధుసూదన్, శ్రీరాంపూర్ ఏరియా జనరల్ మేనేజర్ ఎం.శ్రీనివాస్, బెల్లంపల్లి ఏరియా ఏజీఎం నరేందర్, సత్తుపల్లి జేవీఆర్ ఓసీ2 మేనేజర్ శ్రీ రాజేశ్వర్, ఆర్కే న్యూటెక్ మేనేజర్ కె.శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.