పయనించే సూర్యుడు న్యూస్ మే 28 మండల ప్రతినిధి బొద్దుల భూమేష్ తెలంగాణ ప్రాంతం ఏర్పడినప్పటి నుండి సింగరేణి సంస్థను ప్రభుత్వాలు ఆర్థిక వనరుగా ఉపయోగించడం ఆందోళనకరమని ఎఐఎఫ్టీయూ రాష్ట్ర నాయకుడు చంద్రగిరి శంకర్ అన్నారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాలంలో కూడా సింగరేణిపై ఇంత భారం వేయలేదని ప్రస్తుతం సింగరేణి నిధులను ప్రభుత్వ అవసరాలకు మళ్లించడం వల్ల సంస్థ భవిష్యత్తు ప్రమాదంలో పడిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.మెడికల్ కాలేజీలు, గురుకుల పాఠశాలలు వంటి ప్రభుత్వ కార్యక్రమాలకు సింగరేణి నిధులు వినియోగించడం సరైన విధానం కాదన్నారు. సీఎస్ఆర్,డీఎంఎఫ్టీ నిధులు సింగరేణి ప్రాంతాల అభివృద్ధికే వినియోగించాలని కొత్త గనుల తవ్వకాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.తెలంగాణ ఏర్పడిన తర్వాత 20 గనులు మూతపడ్డాయని, ఒక్క కొత్త గని కూడా ప్రారంభం కాలేదని తెలిపారు.ఒకప్పుడు ఒక లక్షా ఇరవై వేల మంది కార్మికులు పనిచేసిన సింగరేణిలో ప్రస్తుతం ఉద్యోగుల సంఖ్య నలబై వేలకే పరిమితమైందని అన్నారు.యువ కార్మికులను జనరల్ అసిస్టెంట్ పేరుతో అన్ని పనులను చేయించుకుంటూ వారి హక్కులను నిర్లక్ష్యం చేస్తున్నారని విమర్శించారు.జనరల్ అసిస్టెంట్లను మల్టీ జాబ్ వర్కర్స్ గా గుర్తించాలని ఆయన డిమాండ్ చేశారు. సింగరేణి పరిరక్షణ కోసం యువత ముందుకు రావాలని కార్మికుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని ఏఐఎఫ్టియు రాష్ట్ర నాయకులు చంద్రగిరి శంకర్ కోరారు.