దౌల్తాబాద్ మండలం సూరంపల్లి గ్రామంలో 99 రోజుల ప్రణాళికలో భాగంగా రెండవ అంగన్వాడీ కేంద్రంలో పోషకాహార అవగాహన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. చిన్నారుల ఆరోగ్యాభివృద్ధి, తల్లుల్లో పోషకాహారంపై అవగాహన పెంపొందించే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ గంగాధరి స్వప్న స్వామి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ, చిన్నారుల శారీరక మరియు మానసిక అభివృద్ధికి పోషకాహారం ఎంతో అవసరమని తెలిపారు. తల్లులు పిల్లలకు సమతుల ఆహారం అందించాలని, ఆరోగ్యకరమైన ఆహార అలవాట్లు అలవరచాలని సూచించారు. అలాగే గ్రామంలోని అంగన్వాడీ కేంద్రాలు పిల్లల ఆరోగ్య పరిరక్షణలో కీలకపాత్ర పోషిస్తున్నాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమాన్ని అంగన్వాడీ టీచర్లు బాలమణి, నాగరాణి, రజిని కుమారి సమన్వయంతో నిర్వహించారు. ఆశా కార్యకర్తలు బొల్లం రేణుక, కనక లక్ష్మీ, అంగన్వాడీ ఆయాలు మరియు గ్రామ తల్లులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. పోషకాహారం, పరిశుభ్రత, ఆరోగ్య సంరక్షణపై నిర్వహించిన ఈ అవగాహన కార్యక్రమం గ్రామ ప్రజల్లో మంచి స్పందన పొందింది.