సెంట్రల్ బ్యాంక్ ఖాతాదారుల ఖాతాల నుంచి డబ్బులు కట్?

★ అనుమతి లేకుండానే నగదు బదిలీ అయ్యిందంటూ ఖాతాదారుల ఆందోళన ★ బ్యాంకు చుట్టూ బాధితుల ప్రదక్షిణలు.. ★ డబ్బులు తిరిగి చెల్లించాలని డిమాండ్.. ★ బచ్చన్నపేటలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన

పయనించే సూర్యుడు, జూన్ 8, బచ్చన్నపేట మండల ప్రతినిధి: నీల పవన్. బచ్చన్నపేటలోని సెంట్రల్ బ్యాంక్ ఖాతాదారుల ఖాతాల నుంచి వారి అనుమతి లేకుండానే డబ్బులు కట్ అయిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పలువురు ఖాతాదారుల ఖాతాల నుంచి వివిధ మొత్తాలు ఇతర ఖాతాలకు బదిలీ అయినట్లు గుర్తించడంతో వారు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బాధితుల కథనం ప్రకారం, ఇటీవల తమ ఖాతాల నుంచి ఎలాంటి సమాచారం లేకుండానే నగదు డెబిట్ అయినట్లు మొబైల్ ఫోన్‌లకు సందేశాలు రావడంతో వారు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. వెంటనే బ్యాంకు ఖాతా వివరాలను పరిశీలించగా తమ అనుమతి లేకుండా డబ్బులు బదిలీ అయినట్లు గుర్తించినట్లు తెలిపారు. విషయంపై స్పష్టత కోసం బాధితులు నేరుగా సెంట్రల్ బ్యాంక్ బ్రాంచ్‌ను ఆశ్రయించినప్పటికీ అధికారులు సరైన సమాధానం ఇవ్వకుండా కాలయాపన చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. బచ్చన్నపేట మండలంలోని గ్రామానికి చెందిన చైతన్య మహిళ సంఘంలో సభ్యులుగా ఉన్నారని రెగ్యులర్ గా ఉన్నప్పటికీ ఎలాంటి సమాచారం ఇవ్వకుండా వారి అకౌంట్ నుండి నగదు బదిలీ చేశారు. ఇదిలా ఉండగా మహిళ సంఘం బ్యాంక్ ఖాతా పుస్తకం తీసుకెళ్లి బ్రాంచి లో తనిఖీ చేయగా అట్టి ఖాతాలో జమ కాలేదు. మరి ఏ సంఘానికి బదిలీ చేశారనేది సృష్టత రానుంది. అధికారులు చెప్పిన సమాధానాలు కూడా ఒకదానికొకటి పొంతన లేకుండా ఉండటంతో ఖాతాదారుల్లో మరింత అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తమ ఖాతాల్లోని డబ్బులు ఎలా, ఎక్కడికి బదిలీ అయ్యాయో పూర్తిస్థాయిలో వివరాలు వెల్లడించాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. అలాగే బ్యాంకు యాజమాన్యం వెంటనే విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకోవడంతో పాటు ఖాతాల నుంచి కట్ అయిన నగదును తిరిగి జమ చేయాలని కోరుతున్నారు. ఈ ఘటనతో ఖాతాదారుల్లో ఆందోళన నెలకొనగా, తమ కష్టార్జిత సొమ్ము భద్రతపై సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని సమస్యను పరిష్కరించాలని బాధితులు విజ్ఞప్తి చేస్తున్నారు. బ్యాంకు అధికారులు స్పందించి పూర్తి వివరాలు వెల్లడించాల్సిన అవసరం ఉందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. ఈ విషయమై బ్యాంకు మేనేజర్ గోపి నాయక్ ను వివరణ కోరగా మండలంలో ఒకే పేరుతో రెండు మహిళ సమాఖ్య సంఘాలు ఉండడంతో కొంత గందరగోళం నెలకొన్నదని,సమస్యను పరిష్కరించి త్వరలో ఖాతాదారులకు తమ డబ్బును తిరిగి చెల్లిస్తామని మీడియా ద్వారా తెలియజేశారు. ఖాతాదారులు ఎలాంటి ఆందోళన చెందవద్దని పేర్కొన్నారు.