సౌత్ ఇండియన్ రెస్లింగ్ పోటీల్లో సాహితికి కాంస్య పతకం

★ జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా ప్రశంసా పత్రం అందజేత

పయ నించే సూర్యుడు జూన్ 3 (ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ) డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లాకు చెందిన యువ క్రీడాకారిణి వి.బి.ఎస్.ఎన్. సాహితీ సౌత్ ఇండియన్ రెస్లింగ్ పోటీల్లో ప్రతిభ కనబర్చి జిల్లాకు గర్వకారణంగా నిలిచింది. ఇటీవల పాండిచ్చేరిలో నిర్వహించిన సౌత్ ఇండియన్ రెస్లింగ్ ఛాంపియన్ షిప్ లో అండర్ 15 విభాగం, 54 కిలోల బరువు కేటగిరీలో పాల్గొన్న సాహితీ అత్యుత్తమ ప్రదర్శన చేసి మూడవ స్థానాన్ని సాధించి కాంస్య పతకాన్ని కైవసం చేసుకుంది. సాహితీ తండ్రి వి.ఎస్.ఎస్.ఎ.ఎస్.ఎల్. కాట్రేనికోనలో డీఆర్డీఏ ఏపీఎంగా విధులు నిర్వహిస్తున్నారు. కుమార్తె సాధించిన ఈ రోజు , విజయంతో కుటుంబ సభ్యులతో పాటు జిల్లా ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం సాహితీ ముమ్మిడివరం ఠాణేలంక గురుకుల పాఠశాలలో 9వ తరగతి చదువుతూ విద్యతో పాటు క్రీడల్లోనూ రాణిస్తోంది. సాహితీ విజయానికి ఆమె కోచ్ వి. ప్రమీలారాణి కృషి విశేషమని క్రీడా వర్గాలు పేర్కొంటున్నాయి. వేసవి సెలవులను సద్వినియోగం చేసుకుంటూ రెస్లింగ్ లో అవసరమైన సాంకేతిక నైపుణ్యాలు, శారీరక దృఢత్వం, పోటీ స్ఫూర్తి వంటి అంశాల్లో ప్రత్యేక శిక్షణ అందించి ఆమె ప్రతిభను మరింత మెరుగుపరిచారు. క్రీడాకారిణి విజయానికి కోచ్ అందించిన మార్గదర్శకత్వం కీలక పాత్ర పోషించిందని పలువురు అభినందిస్తున్నారు. అదేవిధంగా జిల్లా క్రీడాభివృద్ధి అధికారి (డీఎసీఓ) రుద్ర అమలాపురంలో రెస్లింగ్ క్రీడాభివృద్ధికి అవసరమైన రెస్లింగ్ మ్యాట్, ప్లేగ్రౌండ్ సౌకర్యాలు ఏర్పాటు చేయడం ద్వారా యువ క్రీడాకారులకు ప్రోత్సాహం అందించారు. ఈ సదుపాయాల వల్ల జిల్లాలోని క్రీడాకారులు మెరుగైన శిక్షణ పొందుతూ రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో ప్రతిభ చాటే అవకాశాలు పెరిగాయని క్రీడా వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. సాహితీ సాధించిన విజయాన్ని గుర్తించిన జిల్లా యంత్రాంగం ఆమెను ప్రత్యేకంగా అభినందించింది. ఈ సందర్భంగా గౌరవ జిల్లా కలెక్టర్ సాహితీని సన్మానించి ప్రశంసా పత్రాన్ని అందజేశారు. క్రీడల్లో మరిన్ని విజయాలు సాధించి జిల్లా, రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా క్రీడా అధికారులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, క్రీడాభిమానులు సాహితీకి అభినందనలు తెలియజేస్తూ భవిష్యత్తులో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలోనూ రాణించాలని ఆకాంక్షించారు.