హత్య కేసులో ఇద్దరు నిందితులకు జీవిత ఖైదు

కోర్టు మానిటరింగ్ సిస్టమ్‌తో వేగవంతమైన న్యాయం

పయనించే సూర్యుడు గూడూరు న్యూస్ జూలై 7 జిల్లా ఎస్పీ డా. అజిత వెజెండ్ల, ఐ. పి ఎస్ ఆదేశాల మేరకు, నెల్లూరు జిల్లా పోలీసు శాఖ కోర్టు మానిటరింగ్ సిస్టమ్ ను సమర్థవంతంగా అమలు చేస్తూ, విచారణలో ఉన్న కేసులను నిరంతరం పర్యవేక్షించడం వల్ల మరో కీలక హత్య కేసులో ఇద్దరు నిందితులకు జీవిత ఖైదు శిక్ష విధింపబడింది. గూడూరు వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌లో నమోదైన . సి ఆర్ నెంబర్.45/2021, యు/ఎస్ 120(బి), 302 ఆర్/డబ్ల్యు 34 ఐ పి ఎస్ కేసులో గౌరవనీయులైన 7 వ అదనపు జిల్లా న్యాయమూర్తి కె. వెంకట నాగ పవన్ నిందితులు రవివర్మ @ రవి (ఎ 1) మరియు కలత్తూరు మానస (ఏ 2)లకు జీవిత ఖైదుతో పాటు ఒక్కొక్కరికి రూ.50,000 జరిమానా విధించారు. జరిమానా చెల్లించని పక్షంలో అదనంగా ఆరు నెలల కఠిన కారాగార శిక్ష విధించారు. మృతుడు రూపేష్ తన భార్య మానసతో కలిసి గూడూరులో నివసిస్తూ ప్రైవేట్ ఎలక్ట్రికల్ పనులు చేసుకుంటూ జీవనం సాగించేవాడు. మానసకు రవివర్మతో అక్రమ సంబంధం ఏర్పడడంతో, భర్త అడ్డు తొలగించుకోవాలని ఇద్దరూ కుట్ర పన్ని, 18-02-2021 రాత్రి రూపేష్‌ను ఇనుప రాడ్‌తో తలపై పలుమార్లు దాడి చేసి హత్య చేశారు. ఫిర్యాదు మేరకు అప్పటి గూడూరు వన్‌టౌన్ ఎస్‌ఐ సైదులు కేసు నమోదు చేయగా, అప్పటి సీఐ జి. దాశరధ రామారావు దర్యాప్తు చేపట్టి నిందితులను అరెస్టు చేశారు. అనంతరం సీఐ ఎం. నాగేశ్వరమ్మ సమగ్ర దర్యాప్తు పూర్తి చేసి చార్జిషీట్ దాఖలు చేశారు. జిల్లా పోలీసు శాఖ అమలు చేస్తున్న కోర్టు మానిటరింగ్ సిస్టమ్ ద్వారా కేసును నిరంతరం పర్యవేక్షించడం, సాక్షులను సకాలంలో కోర్టుకు హాజరుపరచడం, ప్రాసిక్యూషన్‌తో సమన్వయం చేయడం వల్ల నిందితులకు కఠిన శిక్ష పడేలా చేయడంలో కీలక పాత్ర పోషించింది. కేసును సమర్థవంతంగా వాదించిన పబ్లిక్ ప్రాసిక్యూటర్ శ్రీ కొత్తపల్లి వసంత కుమార్, సాక్షుల సమన్వయం చేసి కేసును పర్యవేక్షించిన గూడూరు వన్‌టౌన్ సీఐ కె. శేఖర్ బాబు, కోర్టు లైజన్ ఆఫీసర్ ఏఎస్ఐ డి. మల్లికార్జున్, కోర్టు హెడ్ కానిస్టేబుళ్లు యు.వి. రమణయ్య, పి. సుబ్రహ్మణ్యేశ్వరరావులను జిల్లా ఎస్పీ డా. అజిత వెజెండ్ల, ఐ పీ ఎస్ఆభినందించారు. నేరాలకు పాల్పడిన వారిని చట్టం నుంచి తప్పించనీయకుండా, బాధితులకు న్యాయం జరిగేలా కోర్టు మానిటరింగ్ సిస్టమ్ ద్వారా ప్రతి కేసును సమర్థవంతంగా పర్యవేక్షిస్తూ, నిందితులకు కఠిన శిక్షలు పడేలా జిల్లా పోలీసు శాఖ నిరంతరం కృషి చేస్తుందని జిల్లా ఎస్. పి . తెలిపారు.